అరటి పండు అంతరించిపోనుందా..?
అవును మీరు విన్నది నిజమే. శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని పోషకాలను ఇచ్చే అరటి పండు మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని రోజుల్లో అరటి పంట కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా 1000కి పైగా అరటి జాతులు ఉన్నా వాటిలో కేవలం 300 జాతులకు చెందినవి మాత్రమే తినడానికి పనికి వచ్చేవి. ఇప్పుడు వాటిలోని కావెండిష్ రకం ఉనికి కూడా ప్రశ్నర్థకంగా మారినట్టుగా తెలుస్తోంది.
అరటి జాతుల్లో కావెండిష్ జాతి రకానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. ఇప్పుడు ఈ అరటి టీఆర్-4 ఫంగస్ వ్యాధి బారినపడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. కొలంబియాలో ఈ వ్యాధిని కనుగొన్నారు. అత్యంత వేగంగా వ్యాపించే ఈ ఫంగస్‌ను నివారించేందుకు ఇంకా రసాయనాలు అందుబాటులోకి రాలేదు. వీటిపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వేగంగా వ్యాపిస్తున్న ఈ ఫంగస్ వల్ల కవెండిష్ రకం అంతరించిపోతుందేమో అని ఆందోళన వ్యక్తం అవుతోంది. టాక్టర్ టైర్లు, తోటల్లో తిరిగే సమయంలో కాలికి వేసుకునే బూట్ల ద్వారా ఈ ఫంగస్ వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎంత తొందరగా ఈ వ్యాధిని నివారించగలిగితే అంత మంచిదని అభిప్రాయపడుతున్నారు.