బండారు దత్తాత్రేయకు గవర్నర్ పదవి
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ గవర్నర్‌గా నియమితులయ్యారు. 01 సెప్టెంబర్ 2019వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొన్ని రోజులుగా బండారు దత్తాత్రేయకు గవర్నర్ పదవి దక్కుతుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దత్తాత్రేయకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అభినందనలు తెలియచేశారు.
ఇక బండారు దత్తాత్రేయ విషయానికి వస్తే… 1947 ఫిబ్రవరి 26న ఆయన జన్మించారు. 1980లో బీజేపీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేశారు. 1991 నుంచి 2004 మధ్య కాలంలో 10, 12, 13 లోక్ సభకు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. వాజ్ పేయి నేతృత్వంలో కేంద్ర మంత్రిగా సేవలందించారు. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ ఉద్వాసన పలికిన తర్వాత..ఆయనకు కీలక పదవి అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కొన్ని ఏళ్లుగా సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి బరిలో నిలుస్తున్న దత్తన్నకు బీజేపీ మొండిచేయి చూపింది. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానంలో కిషన్ రెడ్డిని బరిలోకి దింపింది. ఈయన విజయం సాధించారు.