తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్.. ర్యాగింగ్ పేరుతో ఓ విద్యార్థిని చావబాదిన కేసులో అతడిపై హైదరాబాద్ శివారులోని దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తాను చదివే కాలేజీలో జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేస్తూ.. అతడిపై దాడి చేశాడు భగీరథ్. చేయి చేసుకోవడమే కాకుండా రాయలేని భాషలో తిడుతూ చావబాదడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, పక్కనే ఉన్న భగీరథ్ స్నేహితుడు కూడా విచక్షణ రహితంగా బాధితుడిపై దాడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ భగీరథ్ హెచ్చరించడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని మంత్రికి చెప్పినా ఎవరూ తనను ఏమీ చేయలేరంటూ భగీరథ్ రంకెలేశారు. ఈ ఘటన నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అతడిపై ఐపీసీ 341, 323, 504, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే భగీరథ్ పై కేసు నమోదు కావడంపై బండి సంజయ్ మీడియా ఎదుట స్పందించారు. తనను ఎదుర్కొనే ధైర్యం లేక .. తన కొడుకుపై కేసు పెట్టిస్తావా అంటూ కేసీఆర్ ను దుయ్యబట్టారు. నా కొడుకును నేనే సరెండర్ చేస్తా.. థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తావా? లాఠీలతో కొట్టిస్తావా? అంటూ ప్రశ్నించారు. నీకు దమ్ముంటే.. మొగోడివైతే నాతో రాజకీయం చేయ్ అంటూ సవాల్ విసిరారు. అయితే వీడియో చూసిన నెటిజన్లు తండ్రీకొడుకు(బండి సంజయ్, బండి భగీరథ్)లను దుమ్మెత్తిపోస్తున్నారు. వీడియోలో భగీరథ్ తోటి విద్యార్థిని తిడుతూ.. కొడుతున్న దృశ్యాలు అంత స్పష్టంగా ఉంటే.. మధ్యలో కేసీఆర్ పై అనవసర విమర్శలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియోకి, కేసీఆర్ రాజకీయానికి సంబంధం ఏంటని నవ్వుతున్నారు. వీడియోలో భగీరథ్ అనవసరంగా ఆ విధ్యార్థిపై చేయి చేసుకోవడం రాష్ట్రమంతటా చూసిందని.. అందులో కేసీఆర్ గానీ, కేసీఆర్ మనువడు గానీ లేరని.. ఈ చిన్న లాజిక్ తెలియకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడివి ఎలా అయ్యావ్ అంటూ ఎదురుప్రశ్నలు వేస్తున్నారు. ఇక తండ్రి అండ చూసుకొని తనను ఎవరూ ఏం చేయలేరన్న లెక్కలేని తనం భగీరథ్ లో కనిపిస్తుందని, పొగరు, గర్వంతో ఇలాంటి పని చేశాడంటున్నారు.
మొదటి నుంచి వివాదాస్పదుడిగా పేరున్న బండి భగీరథ్ .. గతంలోనూ ఢిల్లీలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో చదువుతూ ఇలాగే గొడవలకు దిగడంతో అతన్ని యాజమాన్యం గెంటివేసిందన్న విమర్శలున్నాయి. తాజాగా నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలోని విద్యార్థిని చావబాదాడు. ప్రతిపక్ష నేత బండి సంజయ్ కొడుకు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిపై దాడి చేయడంతో పాటు చంపుతామని బెదిరించిన బండి సాయి భగీరథ్‌పై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహీంద్రా యూనివర్సిటీ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ALSO READ: తండ్రిని మించిన తనయుడు.. బండి సంజయ్ కొడుకుపై ఆర్జీవీ కామెంట్స్