Bandi Sanjay arrested by Police at Midnight when tried to go munugode
mictv telugu

బండి సంజయ్‌ని అరెస్టు చేసిన పోలీసులు

November 3, 2022

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో గత రాత్రి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గం లోనే ఉండి ప్రలోభాలకు గురి చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఆందోళనకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడుకు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు టిఆర్ఎస్ పార్టీ నేతలకు సహకరిస్తూ బీజేపీ కార్యకర్తలను కొడుతున్నారని, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా మునుగోడుకు బయల్దేరగా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. చివరకు ఆయన్ను రామోజీ ఫిలిం సిటీ వద్ద అడ్డుకోగా రోడ్డు పైన బైఠాయించి ఆందోళన చేపట్టారు బండి సంజయ్ .

పోలీసులు బీజేపీ నాయకుల వాహనాలను ఆపి తమపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసుల జులుం నశించాలని నినాదాలు చేశారు. మునుగోడు నియోజకవర్గంలో స్థానికేతర మంత్రులు ఎమ్మెల్యేలు తిష్టవేసి అరాచకాలకు పాల్పడుతుంటే ఎందుకు అడ్డుకోలేదని పోలీసులను నిలదీశారు. బండి సంజయ్ ను చుట్టుముట్టిన పోలీసులు, ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. రామోజ అరెస్ట్ చేశారు. రాత్రంతా ఆయన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఇక బండి సంజయ్ తోపాటు పోలీస్ స్టేషన్లో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు వీరేందర్ గౌడ్, ఎన్. వి.సుభాష్,జెనవాడే సంగప్ప తదితరులు ఉన్నారు.

అంతకుముందు పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. మొదట మలక్‌పేట వద్ద అడ్డుకున్నా సంజయ్‌ ముందుకెళ్లారు. మరోమారు వనస్థలిపురం వద్ద పోలీసులు నిలువరించారు. కార్యకర్తల సహకారంతో కాన్వాయ్‌ ముందుకు సాగింది. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద జాతీయ రహదారిపై తమ వాహనాలుంచి పోలీసులు ఆపారు. దీంతో బీజేపీ కార్యకర్తలు ధర్నా చేశారు. దీంతో ఇరువైపు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు భారీగా నిలిచిపోయాయి.