ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో మీడియాతో మట్లాడిన సంజయ్.. నిన్న ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ తప్ప.. బీఆర్ఎస్ సభను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. సభకు వచ్చిన జనాలు, నేతలు ఎవరూ కూడా సభలో మనస్ఫూర్తిగా పాల్గొనలేదని, ప్రజలను బెదిరించి సభను విజయవంతం చేయాలని చూశారని ఆరోపించారు.
లిక్కర్ స్కాం డబ్బులు పంచుకునేందుకు జాతీయ నేతలు ఖమ్మం వచ్చారని ఆరోపించారు. కేసీఆర్ నోట ఏ దేశం మాట వచ్చినా ఆ దేశం సర్వనాశనం అవుతుందని.. భారతదేశం బాగుందనే మాట కేసీఆర్ నోట రావొద్దని కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదన్న బండి సంజయ్.. పొలం వద్ద ఫ్రీ కరెంట్ అని, ఇంటి దగ్గర కరెంట్‌కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డిస్కంలకు డబ్బులు కట్టకుండా ఫ్రీ కరెంట్ అంటున్నారని.. ముందుగా వాళ్లకు కట్టాల్సిన బకాయిలు చెల్లించాలని సూచించారు. తెలంగాణలో ఎంతమందికి దళితబంధు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ సభకు నిన్న వచ్చిన నేతలు రేపు రారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. వచ్చిన నలుగురు నేతలు నాలుగు స్కామ్‌ల్లో ఉన్నారు. ఒకరు లిక్కర్ స్కాం, మరొకరు గోల్డ్ స్కాం, ఇంకొకరు మైన్ స్కామ్‌లో ఉన్నారన్నారు. నిన్నటి సభకు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇక అగ్నిపథ్ అనేది బిపిన్ రావత్ సూచించారని.. ఆయన కంటే ఎక్కువగా కేసీఆర్‌కు అగ్నిపథ్ గురించి తెలుసా అని విమర్శించారు. రాష్ట్రంలోని గోదావరిలో ఉన్న నీటి లభ్యతను సరిగా వాడుకోవటం చేతకాని కేసీఆర్.. కొత్త ప్రాజెక్టులు కడతానని ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందన్నారు.