బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కవితపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బండి సంజయ్ కవితపై చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేవిగా ఉన్నాయని మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బండి సంజయ్ వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. డీజీపీ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని బండి సంజయ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి నోటీసులు పంపించారు.
మరోవైపు బండి వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ ఈడి కార్యాలయం ముందు దానం, తలసాని సాయి కిరణ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు.
బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. బండి బేషరతుగా కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే బండి సంజయ్‌తో పాటు బీజేపీ నాయకులను తెలంగాణలో తిరిగనివ్వం అని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీలోనూ బీఆర్ఎస్ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు.