హైదరాబాద్ నగరంలో కొత్తగా నిర్మిస్తున్న కొత్త సచివాలయంపై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓవైసీ కళ్లల్లో ఆనందం చూడడం కోసమే తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందని విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేటీఆర్‌కి దమ్ముంటే పాతబస్తీలో రోడ్డు పక్కన ఉన్న గుళ్లు, మసీదులను కూల్చాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే సచివాలయంపై ఉన్న డోమ్‌లను కూల్చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్నర్ మీటింగుల ద్వారా కేసీఆర్ అవినీతి, కుటుంబపాలనను ప్రజల్లోకి తీసుకెళతామని స్పష్టం చేశారు. 60 శాతం ఆదాయం తెచ్చే హైదరాబాద్ నగరంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను పట్టించుకునే పరిస్థితుల్లో కేసీఆర్ లేడని, ప్రశ్నించేవారిని జైల్లో పెడుతున్నారన్నారు. నిరుద్యోగ భృతి ఏమైందని, ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు కూడా ఇవ్వట్లేదని మండిపడ్డారు. కేంద్ర నిధులతో అభివృద్ధి చేసుకుంటూ నిధులివ్వట్లేదని బద్నాం చేయడం సరికాదని హితవు పలికారు. పీఎం ఆవాస్ యోజన, ఫసల్ బీమా యోజన పథకాలను ఎందుకు తెలంగాణలో అమలు చేయడం లేదని నిలదీశారు.