తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గురువారం హైదరాబాద్లోని బీజేపీ పార్టీ ఆఫీస్లో నిర్వహించిన రిపబ్లిక్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం స్ఫూర్తితో భారత్ శక్తివంతంగా తయారవుతోందని అన్నారు. తెలంగాణలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగుతోందని, రాజ్యాంగం, గవర్నర్ తమిళిసై పట్ల సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి గౌరవమే లేదని ఆరోపించారు.
గణతంత్ర వేడుకలు నిర్వహించాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేదని, గణతంత్ర దినోత్సవాన్ని, రాజ్యాంగాన్ని అవమానించిన..కేసీఆర్కు దేశంలో ఉండే హక్కు లేదని ధ్వజమెత్తారు. దేశాన్ని అసహ్యించుకుని, పక్క దేశాలకు వంతపాడే వ్యక్తి కేసీఆర్ అని, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడతామని బండి సంజయ్ అన్నారు.