మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించిన సమాజ్ వాదీ పార్టీతో కేసీఆర్ జతకట్టారని మండిపడ్డారు బండి సంజయ్. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఖమ్మం సభలో కేసీఆర్ కొత్తగా ఏం మాట్లాడలేదని, అదంతా గతంలో మాట్లాడిందేనని ఆరోపించారు. కేసీఆర్ భాష, వేషం తుపాకి రాముడిలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఒక జోకర్ అని, జోకర్ మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
దళితులను వంచించిన కేసీఆర్కు వాళ్ల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. తెలంగాణలో ఎంతమందికి దళితబంధు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం సభలో కేసీఆర్ కనీసం జై తెలంగాణ అని కూడా అనలేదని.. తెలంగాణను మరచిపోయిన కేసీఆర్తో జై తెలంగాణ అనిపిస్తామని హెచ్చరించారు.
యాదాద్రిపై ఖర్చు చేస్తే భారీగా హుండీ ఆదాయం వస్తోందని గతంలో కేటీఆర్ అన్నారని గుర్తు చేసిన బండి సంజయ్.. ఆలయాలపై ఖర్చు చేయండి.. నిధులు వస్తాయని ఇతర రాష్ట్రాల సీఎంలకు కేసీఆర్ చెప్పారా అని ప్రశ్నించారు. గోదావరిలో లభ్యత ఉన్న పూర్తి నీటిని వాడుకునే తెలివి కేసీఆర్కు లేదన్న ఆయన.. కృష్ణా జలాల్లో మన వాటాను కూడా వదులుకున్న వ్యక్తి కేసీఆర్ అని ఆక్షేపించారు. రాష్ట్రంలో బోర్ల సంఖ్య 18 లక్షల నుంచి 24 లక్షలకు ఎందుకు పెరిగిందని ప్రశ్నించిన సంజయ్.. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు.