‘వాళ్ల నెత్తిమీద రూపాయి పెడితే.. అర్ధరూపాయికి కూడా ఎవరూ కొనరు.’ - MicTv.in - Telugu News
mictv telugu

‘వాళ్ల నెత్తిమీద రూపాయి పెడితే.. అర్ధరూపాయికి కూడా ఎవరూ కొనరు.’

October 27, 2022

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారనే వార్తలపై ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. అలాంటి అవసరం తమ పార్టీకి లేదని స్పష్టం చేశారు. అసలు ఇదంతా టీఆర్ఎస్ హైదరాబాద్‌ వేదికగా ఆడుతున్న డ్రామా అని చెప్పారు. ఇటీవల కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లినప్పుడు సదరు స్వామీజీలను పిలిపించుకుని మాట్లాడారని, అక్కడే స్క్రిప్టు రాసి అమలు చేస్తున్నారన్నారు. ఫామ్‌హౌస్‌లో ఉన్న వాళ్లు బీజేపీ వాళ్లు అని ఎవరు చెప్పారని ప్రశ్నించారు.

బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఎంకు సవాల్‌ విసురుతున్నా.. మీరు యాదాద్రి వస్తారా? టైం, తేదీ మీరే చెప్పండి. బీజేపీ తరఫున ఎవరు కోరుకుంటే వాళ్లం వస్తాం. ఈ డ్రామాతో సంబంధం లేదని ప్రమాణం చేసే దమ్ము, ధైర్యం ఉందా?’’ అని ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి పూర్తి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ప్రగతిభవన్‌ నుంచే నడిచిందని, సీఎం కనుసన్నల్లోనే జరిగిందని అన్నారు. ఇందులో సైబరాబాద్‌ కమిషనర్‌ నటుడిగా మారారన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఎక్కడైనా స్వామిజీలు వెళతారా..? అని ప్రశ్నించారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల గుండు మీద రూపాయి పెడితే.. అర్ధరూపాయికి కూడా ఎవరూ కొనరని కౌంటర్ ఇచ్చారు. అలాంటిది రూ. వంద కోట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

ఫామ్‌హౌస్ వాళ్లదే.. ఫిర్యాదు చేసింది వాళ్లేనని.. అందరి ఫోన్ కాల్స్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. మునుగోడు ఉప ఎన్నిక తర్వాతే డ్రామా ఆడుదామని అనుకున్నారని, కానీ ముందుగానే అమలు చేశారని అన్నారు. అలాగే, స్వామీజీలు, నందకుమార్, ఎమ్మెల్యేల మూడు రోజుల కాల్‌డేటాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అహంకారం తలకెక్కి బీజేపీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని బండి సంజయ్ హెచ్చరించారు.

1.ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వంద కోట్లు

 2.బెడిసి కొట్టిన బీజేపీ రిటర్న్ గిఫ్ట్ ఆపరేషన్

3.టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే స్పెషల్ ఆపరేషన్‌

4.BJP తరఫున స్వామీజీల బేరసారాలు.. c/o TRS ఎమ్మెల్యే ఫాం హౌస్

5.రూ.100 కోట్లు ఇస్తాం.. బీజేపీలో చేరకపోతే తప్పుడు కేసులు పెడతాం’

6.పోలీస్ కమిషనర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: బండి సంజయ్