లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ, బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం జరుగుతోంది. కవిత వల్ల తెలంగాణ మహిళలు తలదించుకునే పరిస్థితి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం చేతుల్లో ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేదన్నారు సంజయ్. లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయంపై ఇప్పటి వరకు కేటీఆర్, కేసీఆర్లు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈడీ విచారణకు పిలిపిస్తే నిర్దోషి అని నిరూపించుకోండని కవితకు సంజయ్ హితవు పలికారు. దర్యాప్తు సంస్థలకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కవిత సారా దందా చేస్తే..తెలంగాణ సమాజం తలవంచదంటే నవ్వొస్తోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కవిత లిక్కర్ స్కాం విషయంలో బీజేపీ ప్రమేయమే లేదని స్పష్టం చేశారు. కవిత తప్పు చేసింది కాబట్టే ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు.
దర్యాప్తు సంస్థలను బీజేపీ భ్రష్టు పట్టిస్తోంది : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు పంపడంపై బీఆర్ఎస్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. ఈడీ, సీబీఐ , ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని మంత్రి మండిపడ్డారు. కేంద్ర సంస్థలను ఉపయోగించుకుని బీజేపీ ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న విపక్షాలను నిలువరించేందుకు సీబీఐ, ఈడీ నోటీసులు పంపుతూ బ్లాక్ మెయిల్ చేస్తోందని ద్వజమెత్తారు.