దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న ధర్నాపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఘాటు విమర్శలు చేశారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేయడంపై ఆయన కౌంటర్ అటాక్ చేశారు. బీఆర్ఎస్(BRS) పార్టీలో ఎంత మంది మహిళలు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ క్యాబినెట్ లో 33శాతం మహిళా మంత్రులు ఎందుకు లేరు? అని ప్రశ్నించారు. కవిత ధర్నా చేయాల్సింది ఢిల్లీలో కాదని.. ప్రగతి భవన్ ముందు అని అన్నారు. 33శాతం బీఆర్ఎస్ టికెట్లు మహిళలకు ఇవ్వనందుకు కవిత.. తన తండ్రి కేసీఆర్‌ను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘మహిళా గోస – భాజపా భరోసా’ పేరిట దీక్ష చేపట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ దీక్షను ప్రారంభించారు.
‘ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ రుద్రమదేవి మాదిరి కవిత తనను తాను ఊహించుకుంటోంది. మహిళల రిజర్వేషన్లు గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతకాని తనం వలనే తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. కేసీఆర్ బిడ్డ కేసీఆర్ హాయాంలో మహిళా సర్పంచ్ కే రక్షణ లేకుంటే.. సామాన్యల పరిస్థితి ఏంటి?మహిళల పట్ల సీఎం కేసీఆర్ కోపం, కసితో వ్యవహరిస్తున్నారు. కవిత వలన మహిళా లోకం తల దించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ నాయకులే మహిళలకు శాపంగా మారారు’.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేకపోతే కవిత ఢిల్లీలో మహిళలకు రిజర్వేషన్ కోసం ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు సంజయ్. అంతే కాదు రాష్ట్రంలోని మహిళా సర్పంచ్‌లకు ఎమ్మెల్యేల దగ్గరే రక్షణ లేకుండా పోయిందన్నారు. అలాంటి దాడుల్ని నిరసిస్తూ బీజేపీ దీక్ష చేపడుతున్నాం కానీ ఇది కల్వకుంట్ల కవిత దీక్షకు పోటీ దీక్ష కాదన్నారు. బీజేపీ మహిళా బిల్లుకు కట్టుబడి ఉందన్నారు బండి సంజయ్.