తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రీతి మృతి కేసుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతిది ఆత్మహత్య కాదు..హత్యే అని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదని తెలిపారు. ఆత్మహత్య చేసుకుంటే ఆధారాలను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రీతి ఎంజీఎంలోనే చనిపోయిందని.. మృతదేహాన్ని నిమ్స్‌కు తీసుకొచ్చి వైద్యం చేసి.. ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆదివారం ఆయన జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నీతండాలో ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బండి సంజయ్ ముందు ప్రీతి తల్లిదండ్రులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ బిడ్డకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ ముందు మొర పెట్టుకున్నారు. ప్రీతికి న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తోందని సంజయ్ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఘటనపై ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అంతకుముందు బండి సంజయ్ వచ్చిన సమయంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన వస్తున్నాడని తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు భారీగా అక్కడికి చేరుకున్నారు. బండి సంజయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రీతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో బీజేపీ శ్రేణులు వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు.