మరో కేసులో బండ్ల గణేష్ అరెస్ట్..  - MicTv.in - Telugu News
mictv telugu

మరో కేసులో బండ్ల గణేష్ అరెస్ట్.. 

October 23, 2019

Bandla Ganesh's arrest in another case

కొన్ని రోజుల క్రితం తన అనుచరులతో కలసి ప్రముఖ వ్యాపారవేత్త ప్రసాద్‌ వి.పొట్లూరి(పీవీపీ)ని బెదిరించిన కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తనను హత్య చేసేందుకు తన ఇంటిపైకి కొందరు రౌడీలను బండ్ల గణేష్ పంపించారని ఈనెల 5న జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో పీవీపీ ఫిర్యాదు చేయగా ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. ఆ విషయం గురించి మరిచిపోకముందే బండ్ల గణేష్‌ను పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేశారు. 

కడప జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడంతో ఆయనను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కడప జిల్లాకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేష్ 13 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వకపోవడంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. విచారణకు బండ్ల గణేష్ హాజరుకాలేదు. దీంతో ఆయనపై కోర్టు వారెంట్‌ జారీ చేయగా.. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో రేపు ఆయనను హాజరు పరచనున్నారు. కాగా, బండ్ల గణేష్ వరుసగా పలు కేసుల్లో దోషిగా తేలడంతో సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మూడేళ్ల క్రితం ‘నీ జ‌త‌గా నేనుండాలి’ సినిమా విషయంలో తనను బండ్ల గణేష్ మోసం చేశాడని హీరో సచిన్‌ జోషి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 2017 నవంబర్‌లో మరో చెక్కు బౌన్స్‌ కేసులో బండ్ల గణేష్‌కు ‘టెంపర్’ సినిమాకు కథ అందించిన రచయిత వక్కంతం వంశీ వేసిన కేసులో ఎర్రమంజిల్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.