పెరుగుతున్న సాంకేతికతను, టెక్నాలజీని ఉపయోగించుకొని భారతదేశ వైద్యులు చేసిన మరో ఆపరేషన్ విజయవంతమయ్యింది. బెంగళూరులోని ఫోర్టీస్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి రోగి ప్రాణం కాపాడారు. తెగిపడిన మర్మాంగాన్ని ఆపరేషన్ చేసి విజయవంతంగా అతికించారు. నైజీరిరాలో ఆరు నెలల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడి మర్మాంగం పూర్తిగా తెగిపోయింది. గత ఆరు నెలలుగా అతడు సాదారణ మూత్ర విసర్జన చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో వారు ఫోర్టీస్ ఆసుపత్రిని ఆశ్రయించగా రెండు దశల శస్త్ర చికిత్స చేసి మర్మాంగాన్ని అతికించారు. ప్రస్తుతం మూత్ర విసర్జనకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చేశారు వైద్యులు. మరో ఆరు నెలల తర్వాత బాలుడికి మరో శస్త్ర చికిత్స చేయనున్నారు. మొత్తం మూడో దశలో మూత్రనాళాలను ఏర్పాటు చేస్తారు. బాలుడు పెరిగి పెద్దవాడయ్యాక వైవాహిక జీవితం గడిపేందుకు ఎలాంటి సమస్య ఉండదని యూరో ఆంకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ మోహన్ కేశవమూర్తి తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ శస్త్రచికిత్స వార్త వైరల్గా మారింది. బాలుడు కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.