మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యపై నిరసనలతో మంగళవారం బెంగళూరు నగరం దద్దరిల్లింది. ‘గౌరి హత్య విరోధి వేదిక’ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీతో నగరవీధులు జనసముద్రంగా మారాయి. దేశం నలుమూల నుంచి 50 వేల మంది జర్నలిస్టులు, రచయితలు, విద్యార్థి నేతలు తదితరులు హాజరయ్యారు. రైల్వే స్టేషన్ నుంచి సెంట్రల్ కాలేజీ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ సభ నిర్వహించారు. ‘హేతువాదులు, అభ్యుదయ వాదులపై హత్యలు ఇంకెన్నాళ్లు? గౌరి హంతకులను బోనెక్కించాలి’ అని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు, విద్యార్థి, వామపక్ష పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే-టీజీఎఫ్ నేతలు బ్యానర్లు ప్రదర్శించారు. జర్నలిస్టు పాలగుమ్మ సాయినాథ్, ఉద్యమకారులు మేథా పాట్కర్, తీస్తా సెతల్వాద్, ఆనంద్ పట్వర్ధన్, కవితా కృష్ణన్, జిగ్నేష్ మేవాని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఖేతన్ తదితర ప్రముఖులు ప్రసంగించారు. ఫాసిస్టుల దాడులకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.