బంగ్లా ఆటగాళ్లపై కాల్పులు.. టెస్ట్ మ్యాచ్ రద్దు - MicTv.in - Telugu News
mictv telugu

బంగ్లా ఆటగాళ్లపై కాల్పులు.. టెస్ట్ మ్యాచ్ రద్దు

March 15, 2019

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు చేయడానికి స్థానిక మసీదుకు వెళ్లగా.. అదే సమయంలో గుర్తు తెలియని దుండగుడు ఒకడు మసీదులోకి చొరబడి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. దుండగుడు కాల్పులు జరుపుతూ దాదాపు 17 నిమిషాల పాటు లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయడం గమనార్హం. దీంతో వెంటనే అప్రమత్తమైన బంగ్లాదేశ్ ఆటగాళ్లు అక్కడినుంచి పక్కనే ఉన్న పార్క్ ద్వారా తప్పించుకున్నారు.

బంగ్లదేశ్‌ ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ ట్విటర్‌లో ఈ సంఘటన గురించి పోస్ట్ చేశాడు…‘మా జట్టు సభ్యులందరూ ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. వెంటనే తేరుకుని అక్కడి నుంచి పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నాం. మేమంతా క్షేమంగానే ఉన్నాం. ఈ ప్రమాదం నుంచి జట్టు టీమ్ అంతా తప్పించుకున్నాం. ఇదొక భయానక ఘటన. మా గురించి ప్రార్థించండి’ అని పోస్టు సారాంశం. శుక్రవారం మధ్యాహ్నం డీన్స్‌ అవెన్యూలోని అల్‌నూర్‌ మసీదులోకి చొరబడిన ఓ దుండగుడు తుపాకీతో ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడని ప్రత్యక్షసాక్షి తెలిపారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. అయితే మరో దుండగుడు లిన్‌వుడ్‌ అవెన్యూలోని వేరే మసీదులోకి ప్రవేశించి కాల్పులు జరిపాడని, ఈ దాడిలో ఆరుగురు మృతిచెందారని పోలీసులు చెప్పారు. నెలరోజుల పర్యటనలో భాగంగా బంగ్లా జట్టు న్యూజీలాండ్‌తో మూడు వన్డేలు ఆడగా ప్రస్తుతం రెండు టెస్టులు ముగిశాయి. శనివారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఈ భయానక ఘటన జరగడంతో భద్రతా దృష్ట్యా మూడో టెస్ట్ మ్యాచ్ రద్దయింది.