పొలం అమ్మి భార్యకు ఏనుగు కొనిచ్చాడు.. కథ చాలా ఉంది..  - MicTv.in - Telugu News
mictv telugu

 పొలం అమ్మి భార్యకు ఏనుగు కొనిచ్చాడు.. కథ చాలా ఉంది.. 

September 23, 2020

Bangladesh husband purchase elephant after wife claim  ‘divine order’ in dream.

రామాయణంలో సీతమ్మవారు  బంగారు జింకను చూసి మనసు పారేసుకుంటుంది. రాముడు దాన్ని వెంటాడుతూ వెళ్తాడు. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. భార్య కోరికను తీర్చడానికి భర్తలు పడే పాట్ల గురించి చాలా కథలు ఉన్నాయి. వాటిలో మరో వింత కథ చేరిపోయింది. భార్య కోరిక తీర్చడానికి ఓ సామాన్య రైతు పొలం అమ్మేసి మరీ ఏనుగును కొన్నాడు. బంగ్లాదేశ్‌లోని లాల్మోనిర్హాత్ ప్రాంతంలో ఈ తతంగం జరిగింది. 

దులాల్ చంద్రరాయ్, తులసీరాణిలకు 20 ఏళ్ల కిందట పెళ్లయింది. ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ.  ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. తులసికి తరుచూ కలలో దేవుడు కనిపిస్తుంటాడట. తాజా కలలో కనిపించి.. ‘ఓ ఏనుగును కొనుక్కోండి, అది ప్రజల రోగాలను బాగు చేస్తుంది’ అని చెప్పాడట. ఇంకేముంది.. ఆమె భర్తకు చెప్పేసింది. భార్యను వీరబీభత్సంగా ప్రేమించే దులాల్ వెంటనే పొలాన్ని బేరానికి పెట్టాడు. రెండు బిగాలు అమ్మేశాడు. దాదాపు రూ. 15 లక్షలు పెట్టి ఏనుగు కొన్నాడు. దాన్ని ఇంటికి తీసుకురావడానికి మరో రూ. 17వేల ట్రక్కు అద్దెకింద సమర్పించుకున్నాడు. ఏనుగును పోషించడం మామూలు విషయం కాదుకదా. అందుకే దాని బాగోగులను చూసుకోడానికి నెలకు రూ. 13వేలు జీతం కింద మావటిని కూడా నియమించుకున్నాడు. ఇప్పుడా ఏనుగు దులాల్ పొలంలో నానా గడ్డీ తింటూ తెగ సందడి చేస్తోంది. 

కథ ఇంతటితో ముగియలేదు. తులసికి కలలు అలవాటు కదా. గతంలో వచ్చిన కలల ప్రకారం.. భర్త ఆమెకు ఇదివరకు ఓ గుర్రాన్ని, మేకను, హంసను కొనిచ్చాడు. ఇప్పుడు ఏనుగు కోరిక కూడా తీరినందుకు చాలా సంతోషంగా ఉందని తులసి మురిపెంగా చెబుతోంది.