రిజర్వేషన్లను రద్దు చేసిన బంగ్లాదేశ్ - MicTv.in - Telugu News
mictv telugu

రిజర్వేషన్లను రద్దు చేసిన బంగ్లాదేశ్

April 12, 2018

కుల ప్రాతిపదికన విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఈ నెల 10న అగ్రవర్ణాలు భారత్ బంద్ నిర్వహించడం తెలిసిందే. బంగ్లాదేశ్‌లోనూ రిజర్వేషన్లపై వ్యతిరేకత  పెల్లుబికింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రధాని షేక్‌ హసీనా ఈమేరకు ప్రకటన చేశారు. విద్యార్థుల కోరికమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్లమెంటులో తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వద్ద విద్యార్థులు రోడ్లెక్కుతున్నారు. గత పదేళ్ళలో బంగ్లాలో ఇదే అతిపెద్ద నిరసన. దేశ రాజధాని ఢాకాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రోడ్ల దిగ్బంధాలతో ట్రాఫిక్ స్తంభించింది. ఘర్షణలు, హింస జరుగుతోంది. వందమంది విద్యార్థులు గాయపడ్డారు. శాంతిభద్రతలు అదుపు తప్పే అకాశముందని నిఘా వర్గాలు సర్కారుకు చెప్పాయి.

రిజర్వేషన్లు ఇలా

బంగ్లాదేశ్‌లో ముస్లిం జనాభా అధికం. అయితే సమన్యాయ సూత్రం కింద కొన్ని వర్గాలకు కోటా కల్పించారు. ప్రభుత్వ కొలువుల్లో 56 శాతాన్ని.. స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలు, మహిళలు, మైనార్టీలు, వికలాంగులు, వెనుకబడిన జిల్లాల వారికి కేటాయించారు. అయితే ఈ కోటా భారీగా ఉందని, 10 శాతానికి కుదించాలని డిమాండ్ వస్తోంది. కోటా వున్న వారి శాతం జనాభాలో కేవం 2 శాతమేనని, దీంతో ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతోందని అంటున్నారు.