హీరోయిజానికి అసలైన అర్థం ! - MicTv.in - Telugu News
mictv telugu

హీరోయిజానికి అసలైన అర్థం !

June 22, 2017


ఏంటి ? ఎవరన్నారు ?

క్రికెట్లో దేశభక్తేంటి ? అని ప్రశ్నించాడు బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ మష్రఫే ముర్తూజా. ముక్కుసూటిగా ఉన్న వాస్తవాలను చెప్పాడని చాలా మంది అంటున్నారు. కొందరి కళ్ళకు ఎక్కిన అభిమానపు నిషాని దించేసాడంటున్నారు. మేము పైసలు తీస్కొని ఆడతాం అంత మాత్రాన మేము ఎట్లైతం దేశభక్తులం ? మాకన్నా రియల్ హీరోలు శ్రామికులు, డాక్టర్లు, సమాజ సేవ చేసేవాళ్ళని చాలా ఆసక్తికరంగా మాట్లాడాడు. ఈ అభిమానం అనేది ఒట్టి బూటకంలా అనిపిస్తుందని, అభిమానులు అనవసరంగా మమ్మల్ని మొగులుకు ఎత్తేస్తారు మేమేం పొడిచి పొర్లాడామో మాకే తెలీదు, అలాంటి మమ్మల్ని ఆకాశానికి ఎత్తేసి అనవసరంగా హీరోలను చేస్తున్నారు.ఇది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు.., అంటూ భలే గమ్మతి మీద గరం గరం మాటలు వెల్లడించిన అతని మాట తీరుకు చాలా మంది క్రికెట్ అభిమానులు ఆలోచనలో పడ్డారు.

నిజమే కదా.. పంటలు పండించే రైతులు ఎంతో మంది ఆకలిని తీర్చుతున్నారు పరోక్షంగా , ఇళ్ళు నిర్మంచే కూలీలు ఎన్ని ఇళ్ళ నిర్మాణాల కోసం శ్రమిస్తున్నారు, చెత్త ఊడ్చుతూ, రాళ్లు కొట్టుతూ, రోడ్ల కోసం తట్ట, పారలు పట్టిన శ్రామికులు కారా అసలు సిసలైన దిల్ దార్ హీరోలు, ప్రాణాలు కాపాడే డాక్టర్లు కారా మరు బ్రహ్మలు, న్యాయాన్ని రక్షించే లాయర్లు కారా సమాజోద్ధారకులు, అవినీతిని అంతమొందించే పోలీసులు కారా ఆల్ టైం హీరోలు, వీళ్లంతా ఒకెత్తు అయితే మనలను కన్న తల్లిదండ్రులు కారా దేవుళ్ల తర్వాత దేవుళ్లు !?? అంటూ ఎన్నో మన బుర్రకు రానివి, అందని ఇన్నిన్ని మంచి ఆలోచనలు రేకెత్తించిన ముర్తూజా మాటలు వెర్రి ఫ్యాన్సుకు ఇన్స్పిరేషన్ గా నిలిచాయి.

కేవలం ఒక ఆట ఆడినంత మాత్రానా, సినిమాల్లో హీరోయిన్లతో డ్యూయెట్లు, నాలుగు తూతూ మంతర్ ఫైట్లు చేసినంత మాత్రానా సినిమా హీరో రియల్ హోరోనా ? మాకన్నా ఎందరో రియల్ హీరోలున్నారు వాళ్ళను గుర్తించండి, వీలైతే వారికి ఫ్యాన్సుగా మారండి. డబ్బు కోసం ఆటాడే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ దేశభక్తులం కామని, నేను మైదానంలో ఆట ఆడగలను కానీ అదే మైదానంలో పంట వేసి చారెడు గింజలు పండించగలనా ? ఒకరి ప్రాణాలు కాపాడ గలనా ? అవి రైతు, డాక్టర్లు మాత్రమే చెయ్యగలరు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. వృత్తి కోసం సమాజానికి వారు చేస్తున్న మంచిని గ్రహించాల్సిన అవసరం చాలా వుందని ఖరాఖండిగా మాట్లాడిన ముర్తూజా మాటలు కొందరి అభిమానపు పిచ్చిని వదలగొట్టిందనే చెప్పాలి !

మాలా లైమ్ లైట్ లో వుండే వాళ్ళంతా గొప్ప స్వార్థపరులు ఇందులో మా సరదానే వృత్తి అయింది కానీ అందరిదీ వృత్తితో ముడిపడిన గొప్ప సోషల్ వర్క్. మాదేముంది మాకన్నా ఎప్పడో 1971 స్వాతంత్ర్య పోరాట సమయంలో క్రికెటర్ రకిబుల్ హసన్ తన బ్యాటు మీద ‘ బంగ్లాకు స్వేచ్ఛనివ్వండనే ’ సందేశం రాస్కొని మైదానంలోకి వెళ్లాడు. అతను ఆల్ టైం హీరో అంటాను నేను. అభిమానం అభిమానం అని ఉర్రూతలూగే వాళ్ళంతా రోడ్డు మీద తొక్కలెయ్యటం, వీధుల్లో ఎర్రగా ఉమ్మటం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వంటివి మానేసి, మమ్మల్ని మా ఆటకు వదిలేస్తే సరిపోతుందని చెప్పడంలో అతని పరిపక్వత ఏంటో అర్థమౌతున్నది.సౌత్ వెస్ట్ బంగ్లాదేశ్ లో నరాలి జిల్లాలో అతి సాధారణ కుటుంబంలో పుట్టాడు గనక ఇంత బాగా చెప్పగలిగాడు.

కానీ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింటు రైజవుతోంది. అదేంటంటే క్రికెటర్లను అభిమానించొద్దు రైతులు, డాక్టర్లను అభిమానించాలన్న ముర్తూజా తనే ఒక రైతుకు, డాక్టర్ కి ఫ్యాన్ నని ప్రకటిస్తే చాలా మందిలో సాధారణ వ్యక్తులను అభిమానించాలి, ఆదరించాలనే ఇంట్రస్టు క్రియేట్ అవుతుంది కదా !?