బీఏ పాసయ్యేందుకు మహిళా ఎంపీ మాస్టర్ ప్లాన్..! - MicTv.in - Telugu News
mictv telugu

బీఏ పాసయ్యేందుకు మహిళా ఎంపీ మాస్టర్ ప్లాన్..!

October 23, 2019

అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఏ పరీక్షల్లో పాస్ అయ్యేందుకు మహిళా ఎంపీ మాస్టర్ ప్లాన్ వేసింది. ఏ రోజూ పరీక్షలకు హాజరుకాకుండానే 13 పరీక్షల్లో పాస్ అయ్యారు. ఇక మిగిలిన పరీక్షలు పూర్తి అయితే పట్టా పుచ్చుకోవడమే అనుకునే సమయంలో అడ్డంగా బుక్కయ్యారు. బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. స్థానిక మీడియా ఈ తతంగాన్ని బయటపెట్టడంతో యూనివర్సిటీ అధికారులు ఆమె అడ్మిషన్‌ను రద్దు చేశారు. మరోసారి ఆమెకు యూనివర్సిటీలో చేరే అవకాశం లేకుండా చేశారు. 

అవామీ లీగ్ పార్టీ ఎంపీ తమన్నా నుస్రత్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ డిగ్రీ చేస్తున్నారు. నాలుగు టర్ములు కలిగిన ఈ కోర్సులో ఇప్పటి వరకూ ఏ పరీక్షకు హాజరుకాలేదు. ఆమె తరుపున వేరే వారిని పంపించి పరీక్షలు రాయించి పరీక్షల్లో హ్యాపీగా పాసైపోయారు. ఇప్పటి వరకు మొత్తం 8 మందిని పరీక్షలు రాసేందుకు పంపారు. ఈ విషయం టీచర్లకు, తోటి విద్యార్థులకు తెలిసినా ఎవరూ నోరు మొదపలేదు. తాజాగా అక్కడి మీడియా ప్రతినిధి ఒకరు దీన్ని బయటపెట్టడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తమన్నా నుస్రత్‌ పరీక్షల్లో పాస్ అయ్యేందుకు చేసిన పనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి అడ్డదారిలో పట్టా తెచ్చుకోవాలనుకున్న ఆమె ప్రయత్నాలు బెడిసికొట్టాయి.