పొలంలో దిష్టిబొమ్మలు కాపీ.. ట్రాఫిక్ పోలీసులు ఇలా..  - MicTv.in - Telugu News
mictv telugu

పొలంలో దిష్టిబొమ్మలు కాపీ.. ట్రాఫిక్ పోలీసులు ఇలా.. 

November 25, 2019

చేనుల్లో పక్షులు రాకుండా ఉండటానికి దిష్టి బొమ్మలు పెడుతుంటారు. పందులు రాకుండా పులి బొమ్మలు కూడా పెడతారు. అలా పెడితే మనిషి, పులి పొలంలో ఉన్నాడనుకుని పక్షులు, పందులు పంటవైపు రావు. దీంతో పంటను రక్షించుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఈ ఐడియాను బెగుళూరు ట్రాఫిక్ పోలీసులు వాడుకున్నారు. ఇంతకీ ఇక్కడ పక్షులు, పందులు ఎవరనుకుంటున్నారూ.. ట్రాఫిక్ సిగ్నల్స్ లెక్కచేయకుండా ఉల్లంఘించేవారు, వాహనాలను వేగంగా తోలేవారు. ఇంకా అర్థంకాలేదు కదూ.. ఇక్కడ దిష్టిబొమ్మల మాదిరి వారు ట్రాఫిక్ పోలీసుల బొమ్మలను తయారుచేశారు. 

దూరం నుంచి చూస్తే అచ్చం ట్రాఫిక్‌ పోలీసులే అనుకుంటారు. ఆ ఉద్దేశంతోనే వారు ఈ వినూత్న ఉపాయానికి తెరలేపారు. ట్రాఫిక్‌ పోలీసులను పోలిన బొమ్మలకు యూనిఫాంలో ఉండే రిఫ్లెక్టర్‌ జాకెట్‌, తెల్లని చొక్కా, ఖాకీ ప్యాంటు, టోపీ, నల్లని షూ తొడిగారు. ఈవిధంగా తయారుచేసిన 30 బొమ్మలను చిన్నచిన్న కూడళ్ల వద్ద నిలబెట్టారు. ఈ బొమ్మలను దూరం నుంచి చూడగానే ట్రాఫిక్‌లో ఉచ్చ ఆగనివాళ్లు కాస్త అప్రమత్తమవుతారని వారి పథకం. కేవలం ఒక్క చోటే ఈ బొమ్మలను ఉంచకుండా వివిధ ప్రదేశాల్లోకి మారుస్తామని అంటున్నారు. దీంతో వాహనదారులు నిజమైన ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లకి, ట్రాఫిక్‌ కానిస్టేబుళ్ల బొమ్మలకు వ్యత్యాసం గుర్తించే వీలు ఉండదని అధికారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

ట్రాఫిక్‌ పోలీసులు గతంలోనూ ఇలాంటి ప్రయోగాలు చేపట్టారు. ప్రజల్లో ట్రాఫిక్‌పై అవగాహన పెంపొందించేందుకు.. కొన్ని సంజ్ఞలు చేస్తున్నట్లు రూపొందించిన కార్డుబోర్డుల ట్రాఫిక్‌ పోలీసు బొమ్మలు సఫలం అయ్యాయి. కాగా, ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నానికి సోషల్ మీడియాలో ప్రశంసలు లభిస్తున్నాయి. మంచి ప్రయత్నం అంటున్నారు.