తెలంగాణ పోలీస్ కంట్రోల్ రూం దొంగలు దొరికారు
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 11వ తేదీన 38 కాపర్ బండిల్స్‌ను చోరీ చేసిన ముగ్గురు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రూ.40 లక్షల విలువైన… కాపర్ బండిళ్ళను దొంగలించి , వాటిని క్రిష్ణానగర్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో టోలీచౌకీలోని సెకండ్ లాన్సర్‌కు చెందిన సోనూఖాన్, అస్సాంకు చెందిన సౌరబ్ బిస్వాస్, ఒడిశాకు చెందిన బికాష్ రంజన్ బెహెరా ఉన్నారు.ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న శంకర్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో కాపర్ వైర్ బండిళ్ళను కొనుగోలు చేసిన స్క్రాప్ వ్యాపారులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సోనూఖాన్ అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడని, స్టోర్ హెల్పర్‌గా పని చేస్తున్న శంకర్‌తో పాటు సౌరబ్ బిశ్వాస్, బికాష్ రంజన్ బెహరాలు కలిసి పథకం ప్రకారం కాపర్ బెండిళ్ళను చోరీ చేసి ఎన్‌బీటీ నగర్, బల్కంపేట, ముషీరాబాద్‌లలోని ముగ్గురు స్క్రాప్ వ్యాపారులకు విక్రయించారని పోలీసులు తెలిపారు.