తెలంగాణ, ఏపీల ఏటీఎంలకు పొరుగు డబ్బులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ, ఏపీల ఏటీఎంలకు పొరుగు డబ్బులు

March 29, 2018

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఏటీఎంలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎక్కడ చూసిన నో క్యాష్ బోర్డులే. హైదరాబాద్, విజయవాడ వంటి పెద్ద నగరాల్లోనూ తిప్పలే. ఇక చిన్న పట్టణాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నగదు దొరక్క ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు రోజులు కావడంతో కష్టాలు పెరిగాయి. బ్యాంకుల్లో డబ్బుల్లేకపోవడంతో ఆసరా, గ్రామీణ ఉపాధి హామీ వంటి పథకాల లబ్ధిదారులు నానా ఇక్కట్లు పడుతున్నారు. కేవలం సగం ఏటీఎంలలో డబ్బులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.ప్రజలు ఏటీఎంలకు అంత్యక్రియలు చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. దీన్ని గుర్తించిన బ్యాంకులు సమస్య పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రాల నుంచి నగదు తెప్పిస్తున్నాయి. ఇప్పటికే కుంభకోణాలతో పరువు, విశ్వసనీయత పొగొట్టుకున్నామని, ఇక డబ్బులు కూడా ఇవ్వకపోతే జనం తిరగబడే పరిస్థితి వస్తుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పారు.

ఏపీ ఏటీఎంలను నింపడానికి ఒడిశా, తమిళనాడు బ్యాంకుల నుంచి, తెలంగాణకు కేరళ, తమిళనాడుల నుంచి నగదు తెప్పిస్తున్నారు. రెండు నెలలుగా డబ్బులు తెప్పిస్తున్నా ఖాతాదారుల అవసరాలు తీర్చలేకపోతున్నాయి. బ్యాంకులు. చాలామంది పెద్ద మొత్తాలను డ్రా చేసుకుంటున్నారు, బ్యాంకులకు డబ్బు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. రిజర్వు బ్యాంకు గత ఏడాది సెప్టెంబర్ నుంచి రెండు వేల నోట్లను బ్యాంకులకు సరఫరా చేయడం మానేసింది.