Bank manager jailed for giving Rs 5.70 crore to girl
mictv telugu

అమ్మాయిపై ఆశతో.. 5.70 కోట్లు ఇచ్చి జైలుకెళ్లిన బ్యాంక్ మేనేజర్

June 25, 2022

డేటింగ్ యాప్‌లో పరిచయమైన అమ్మాయి మాయలో పడి కస్టమర్ల డబ్బును దోచిపెట్టాడు ఓ బ్యాంకు మేనేజరు. దశల వారీగా సుమారు రూ. 5.70 కోట్లు ఇచ్చి మోసపోయి, ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హనుమంతనగర ఇండియన్ బ్యాంకులో హరిశంకర్ అనే వ్యక్తి మేనేజరుగా పనిచేస్తున్నాడు. కేరళకు చెందిన ఈయన.. భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లడంతో అడ్డదార్లు తొక్కి డేటింగ్ యాప్‌లో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పూర్తిగా ఆమె మాయలో పడిపోయి తన సొంత డబ్బు రూ. 12 లక్షలతో పాటు ఖాతాదారులకు చెందిన రూ. 5.70 కోట్లను ఆరు రోజుల్లో 136 సార్లు ట్రాన్స్‌ఫర్ చేశాడు.

కర్ణాటకలో రెండు అకౌంట్లు, పశ్చిమ బెంగాల్‌లో 28 బ్యాంకు అకౌంట్లకు ఈ డబ్బు ట్రాన్స్‌ఫర్ అయింది. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు అంతర్గత విచారణ జరుపగా, ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి హరిశంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా, నేరం అంగీకరించాడు. తర్వాత అతనికి సహకరించిన వ్యక్తులు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని కోర్టు ద్వారా 10 రోజుల రిమాండుకు తరలించారు.