బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగంలో అక్విజిషన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 500 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో 203 పోస్టులు అన్‌రిజర్వ్‌డ్‌గా ఉండగా, 135 ఓబీసీ, 75 ఎస్సీ, 37 ఎస్టీ, 50 ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రిజర్వు చేయగా..అక్విజిషన్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరగనుంది. వారణాసి, లక్నో, ప్రయాగ్‌రాజ్, బరేలీ, కాన్పూర్, ఢిల్లీ, పాట్నా మొదలైన నగరాల్లో భర్తీ చేయనున్నారు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా bankofbaroda.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా, అభ్యర్థులు ముందుగా నమోదు చేసుకున్న తర్వాత వివరాలతో లాగిన్ అవ్వాలి. తద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తును నమోదు చేయాలి. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఆన్‌లైన్ లో రూ. 600 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు రూ. 100 మాత్రమే చెల్లించాలి. ఈ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 22 నుండి కొనసాగుతోంది అభ్యర్థులు మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆఫీసర్ ఆఫ్ అక్విజిషన్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఏదైనా ఇతర ఉన్నత విద్యా సంస్థ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ పొంది ఉండాలి. అలాగే, అభ్యర్థుల వయస్సు 1 జనవరి 2023 నాటికి 21 సంవత్సరాల కంటే తక్కువ, 28 సంవత్సరాలకు మించి ఉండకూడదు. అయితే, రిజర్వ్ చేయబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్లోని నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.