Bank Recovery Agents repeated phone calls to Mla Anil Kumar Yadav
mictv telugu

పోయి పోయి ఎమ్మెల్యేతోనే పెట్టుకున్నారు.. రియాక్షన్ ఇది

July 29, 2022

 

తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్, ఫైనాన్స్ సంస్థలు, రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సామాన్యులనే కాదు ఏకంగా ప్రముఖులకు సైతం వీరి వేధింపులు తప్పడంలేదు. తాజాగా ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ని కూడా డబ్బులు కట్టి తీరాల్సిందేనని బెదిరించారు. లోన్ తీసుకున్న వ్యక్తితో తనకెలాంటి సంబంధం లేదని, దయచేసి తనకు ఫోన్లు చేయొద్దని మర్యాదపూర్వకంగా మాట్లాడినా.. లోన్ కట్టేంతవరకూ ఫోన్లు చేస్తూనే ఉంటామని వార్నింగ్ ఇచ్చారు. ఒక ప్రజా ప్రతినిధిని ఇలా బెదిరించడంతో.. ఆ ఎమ్మెల్యే తనదైన శైలిలో వారికి జవాబిచ్చారు.

ఫుల్లర్‌టన్ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఓ మహిళా ఏజెంట్ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌కు కాల్ చేసింది. పాతపాటి అశోక్ కుమార్ అనే వ్యక్తి లోన్ తీసుకున్నాడని.. ఆల్టర్‌నేట్ నంబర్‌గా మీ నంబర్ ఇచ్చారు కాబట్టి ఆ లోన్ మీరే కట్టాలని చెప్పింది. ఆ అశోక్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, కావాలంటే కేసు పెట్టి ఆ వ్యక్తిని జైల్లో పెట్టుకోండని చెబుతున్నా వినలేదు. అప్పుడు ప్రియాంక అనే మరో రికవరి ఏజెంట్ ఫోన్ అందుకొని, బెదిరింపులకు దిగింది. ఆ అశోక్, మీరు కలిసి తిన్న రూ. 8 లక్షలు ఎవరు కడతారు? అంటూ ఎమ్మెల్యేని దబాయించింది. అప్పటివరకూ కూల్ గా సమాధానమిచ్చిన అనిల్ కుమార్.. చిర్రెత్తుకొచ్చి చెప్పుతో కొడతానంటూ ఫైర్ అయ్యారు. అందుకు ఆ ప్రియాంక తనకూ మాట్లాడ్డం వచ్చని రెచ్చిపోయింది.

గొడవ ఎందుకులే అని అనిల్ కుమార్ యాదవ్ ఫోన్ పెట్టేసి సైలెంట్ అయితే.. మళ్లీ 20 సార్లకు పైగా ఫోన్ చేసి హింసించింది. డబ్బులు కట్టేదాకా ఫోన్ చేస్తూనే ఉంటానంటూ హెచ్చరించింది. ఈ వ్యవహారం తెగేలా లేదనుకున్న అనిల్ కుమార్.. తనదైన శైలిలో యాక్షన్ తీసుకున్నారు. ఆ బ్యాంక్ వివరాలు సేకరించి, పోలీసుల్ని పంపించారు. ఆ ఏజెంట్లకు బేడీలు వేసి, లోపలేశారు. ఏపీలో ప్రస్తుతం ఈ ఫోన్ కాల్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.