Bapatla Water Resources Department new condition to Contractors for Tenders
mictv telugu

డబ్బుల కోసం కోర్టుకు వెళ్లొద్దు.. టెండర్లలో జగన్ ట్విస్ట్

June 1, 2022

Bapatla Water Resources Department new condition to Contractors for Tenders

“ప్రభుత్వ పనులకు టెండర్లు వేయదలచిన కాంట్రాక్టర్లకు ఇదే మా ఆహ్వానం. ముందు మీ దగ్గరున్న డబ్బులతో పని పూర్తి చేయండి. పూర్తయ్యాక మా దగ్గర డబ్బులుంటే ఇస్తాం. లేదంటే మేం ఇచ్చే వరకు ఎదురు చూడండి. అంతేకానీ బిల్లులు చెల్లించలేదని కోర్టుల వరకూ వెళ్లకండి. అలా అయితేనే టెండర్లు వేయండి. లేదంటే మానేయండి”. ఇదీ ఏపీలోని జగన్ సర్కార్ తీరు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని కాలువల మరమ్మతులకు బాపట్ల జిల్లా జలవనరుల శాఖ టెండర్లను ఆహ్వానించింది. రూ. 13 కోట్ల విలువైన మరమ్మతు పనులు చేపట్టాలని , జూన్‌ 6లోపు టెండర్లు దాఖలు చేయవచ్చునని పేర్కొంది.

టెండరు డాక్యుమెంట్‌లోని ఒక నిబంధన చూసి కాంట్రాక్టర్లు షాక్ అయ్యారు. ‘స్పెషల్‌ కండిషన్‌ ఆఫ్‌ నోట్‌’ అంటూ… ‘‘బాగా అదనపు నిధులు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే బిల్లుల చెల్లింపు జరుగుతుంది. బిల్లుల చెల్లింపులో ఏదైనా ఆలస్యం జరిగితే… కాంట్రాక్టు సంస్థకు కోర్టుకు వెళ్లే హక్కు ఉండదు. కోర్టును ఆశ్రయించకుండా, బిల్లులు చెల్లించేదాకా వేచి చూసే కాంట్రాక్టర్లు మాత్రమే ఈ పనులకు టెండర్లు దాఖలు చేయాలి’’ అని జలవనరుల శాఖ పేర్కొంది. అంటే… కాంట్రాక్టర్లు సొంత డబ్బులతో కాలువలకు మరమ్మతు చేసి, ఆ తర్వాత బిల్లుల చెల్లింపు కోసం ‘ఓపిగ్గా’ ఎదురు చూస్తూనే ఉండాలి. ఎందుకు ఆలస్యం, ఏమిటీ అన్యాయం అని ప్రశ్నించకూడదు. కోర్టుకు అసలు వెళ్లనే కూడదు. ఈ నిబంధనలపై కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. పనులు పూర్తి చేసిన తర్వాత బిల్లులు చెల్లించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

అసలు విషయం ఏంటంటే.. ఇంతకుముందు కాంట్రాక్టర్లకు ఉపాధిహామీపథకం బిల్లుల చెల్లింపు విషయంలో జాప్యంపై ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వడ్డీతో సహా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ఇటీవల ఆదేశించింది. ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు రాక ఆందోళనబాట పట్టగా, మరి కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జలవనరులశాఖ ముందుగానే తమకు అనుకూలంగా షరతులు పెట్టింది. ఈ కండీషన్లు చూసిన కాంట్రాక్టర్లు.. టెండర్లు వేస్తారో లేదో వేచి చూడాలి.