bare foot empress documentary by Chef Vikas Khanna
mictv telugu

 సాధించాలనుకునే వాళ్ళకి ప్రేమలేఖ-బేర్ ఫుట్ ఎంప్రెస్

November 8, 2022

ఏదైనా సాధించాలని అనుకుని పోరాడేవాళ్ళకు ఈ డాక్యుమెంటరీ ఒక ప్రేమలేఖ అంటారు ఫేమస్ ఛెఫ్ వికాస్ ఖన్నా. 96 ఏళ్ళ వయసులో నాలుగో క్లాసు పట్టుబట్టి పాసయ్యారు కార్తాయని అమ్మ. బతకడమే ఎందుకు అనుకునే ఏజ్ లో చదువుకుని ఆదర్శంగా నిలిచారు. అందుకే ఆమె మీద బేర్ ఫుట్ ఎంప్రెస్ అనే డాక్యుమెంటరీ తీశాడు వికాస్ ఖన్నా.

కార్తాయని అమ్మది కేరళ. పుట్టింది, పెరిగింది అంతా అక్కడే. 96 ఏళ్ల వయసులో చదువుకోవడానికి ముందుకు రావడమే చాలా గొప్ప అంటే 98 శాతం మార్కులు సాధించడం మరీ గొప్ప. ఆమె చదివింది నాలుగో క్లాసే కానీ మనం చెప్పుకోవలసింది దాని వెనుక ఉన్న పట్టుదల గురించి. దాన్ని ఎంత బాగా చేసింది అన్న దాని గురించి. నాలుగో క్లాసుకే ఇంత బిల్డస్ ఎందుకు అనుకుంటే మాత్రం మనం అక్కడే ఆగిపోయినట్లు. మన ఎదుగుదలకు మనమే గోతులు తవ్వుకున్నట్టు.

కేరళ ప్రభుత్వం వయోజనుల కోసం ఏర్పాటు చేసిన అక్షరాస్యతా కార్యక్రమంలో పాల్గొనడానికి అందరికన్నా ముందుకు వచ్చింది కార్తాయని అమ్మ. అలెప్పి జిల్లాలో చెప్పడ్ అనే చెన్న గ్రామంలో ఉండే ఆమె ఎంత ఉత్సాహంగా చదువుమొదలుపెట్టారో అంతే ఉత్సాహంగా దాన్ని చేస్తున్నారు కూడా. 100కు 30 వస్తే చాలు అనే చోట 98 మార్కులు తెచ్చుకున్నారు. దాంతో ఆమెకు కేరళ రాష్ట్రమే కాదు దేశం మొత్తం సలామ్ చేసింది. కేంద్రం స్త్రీ శక్తి అవార్డ్ ఇచ్చి సత్కరించింది . ప్రధాని మోడీ కార్తాయని అమ్మతో కూర్చుని కాసేపు మాట్లాడారు కూడా.

వరల్డ్ ఫేమస్ చెఫ్ వికాస్ ఖన్నా కార్తాయి అమ్మ మీద ఒక డాక్యుమెంటరీ తీశారు. వికాస్ తన చిన్నతనం అంతా నాయనమ్మ చేతుల్లోనే పెరిగారు. ఆయనకు వంట నేర్పింది కూడా ఆమెనే. ఆ ప్రేమే కార్తాయని అమ్మ మీద డాక్యుమెంటరీ తీసేలా చేసింది అంటారు. వికాస్ కు ఇది రెండో డాక్యుమెంటరీ. ఉత్తకాళ్ళతో పరీక్ష రాయడానికి వెళుతున్న ఒక యోధురాలు అతనిని కట్టిపడేసింది. అందుకే బేర్ ఫుట్ ఎంప్రెస్ అని టైటిల్ పెట్టారు ఈ డాక్యుమెంటరీకి.

కార్తాయని అమ్మ నాలుగో క్లాసుతో చదువు ఆపేయలేదు. చనిపోయేంతవరకు తనకు చదువుకోవాలనే ఉంది అని చెబుతున్నారు ఆమె. బేర్ ఫుట్ ఎంప్రెస్ డాక్యుమెంటరీ ఇప్పటికే అంతర్జాతీయ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమయ్యింది. త్వరలో ఇండియాలో కూడా ఓటీటీలో విడుదల అవనుంది. దీన్ని మీరు చూడండి. మరింతమందికి చూపించండి. అమ్మాయిలు చదువుకునేలా చేయండి.