పూల సంబరాలు.. నేడు అటుకుల బతుకమ్మ - MicTv.in - Telugu News
mictv telugu

పూల సంబరాలు.. నేడు అటుకుల బతుకమ్మ

October 17, 2020

nvgnfg

మహా అమావాస్య (పెత్తరమాస) సందర్భంగా నిన్న ఎంగిలి పూల బతుకమ్మతో తెలంగాణలో తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాలు ప్రారంభం అయ్యాయి. కరోనా, వాన భీబత్సం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలు గౌరమ్మను పూలతో అలంకరించి పూజించడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి విపత్తులు రాకూడదని గౌరమ్మను భక్తి శ్రద్ధలతో వేడుకుంటున్నారు. నిన్న సాయంత్రం ముంగిళ్లలో కళ్లాపి జల్లి చక్కగా బొడ్డెమ్మలు పేర్చి బతుకమ్మ పాటలు ఆడిపాడి నువ్వులు, బియ్యంపిండి, నూకలతో నైవేద్యం సమర్పించారు. ఈరోజు కూడా తెలంగాణ ఆడపడుచులు అందరూ బతుకమ్మ సంబరాల్లో మునిగి తేలడానికి సిద్ధం అవుతున్నారు. తొమ్మిది రోజుల సంబరాల్లో భాగంగా ఇవాళ ఆశ్వయిజ శుద్ధ పాడ్యమి కావడంతో మహిళలు అందరూ శుచీశుభ్రతతో రోజంతా ఉపవాసం పాటించి బతుకమ్మను పేర్చుతారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు (శనివారం) ప్రధానంగా అటుకులను నివేదిస్తారు కాబట్టి ‘అటుకుల బతుకమ్మ’గా గౌరమ్మను పిలుస్తారు. రెండు ఎత్తుల్లో గౌరమ్మను పేర్చి, ఆటపాటలతో వేడుక జరుపుకొంటారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

కోడి కూసే వేళ ఆడపడుచుల అన్నదమ్ములు, బాబాయిలు, నాన్నలు, తాతలు, బావలు, మామలు ఇలా ఇంటి మగవాళ్లందరూ శివారు మీద గునుగు, తంగేడు పూలు కోసుకురావడానికి సైకిళ్లు మీద వెళ్తున్నారు. సీతాకుచ్చు పూలు, తామరలు, గుమ్మడి, చక్రం పూలు, గుర్మాశి పూలు, బంతులు, చేమంతులు,మందారాలు, వినాయక పుష్పాలు ఇలా ఎన్నో రంగుల పూలతో అతివల చేతులతో బతుకమ్మలు ముస్తాబు అవుతున్నాయి. పట్టుచీరల్లో ఆడపడుచుల శోభ ఈ పండగ ప్రత్యేకం. కాగా, బతుకమ్మ పండుగ స్ఫూర్తితో మనందరం ఉమ్మడిగా కరోనాను ఎదుర్కొందామంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ‘కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, సురక్షితంగా, సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలి. ఎక్కువమంది ఒకేచోట గుమిగూడకూడవద్దు. కరోనా ‌కారణంగా ఈ ఏడాది, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించ‌డం లేదు’ అని కవిత పేర్కొన్నారు.