bathukamma festival celebration starting from 25th september in Telangana
mictv telugu

ఈ నెల 25 నుంచి బతుకమ్మ ఉత్సవాలు..

September 19, 2022

bathukamma festival celebration starting from 25th september in Telangana

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ఉత్సవాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర పండుగగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలను ఈ నెల 25 నుంచి అక్టోబర్ 3 వరకు ఘనంగా, ఆ సంబురాలను అంబరాన్ని తాకేలా నిర్వహించాలని అధికారులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో సమన్వయ సమావేశం జరిగింది. భేటీలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు ఆయాశాఖ అధికారులు పాల్గొన్నారు. బతుకమ్మ ఉత్సవాల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు.

ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న వేడుకలకు రాష్ట్రవ్యాప్తగా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తెలిపారు. అక్టోబర్‌ 3న ట్యాంక్‌బండ్‌ వద్ద సద్దుల బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయన్నారు. సద్దుల బతుకమ్మకు పురస్కరించుకుని భారీ సంఖ్యలో ఆడపడుచులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని అధికారులకు తెలిపారు. బతుకమ్మ పండుగపై ఆకర్షణీయమైన డిజైన్లతో మెట్రో పిల్లర్లను అలంకరించాలని ఆదేశించారు. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు రమణాచారి తెలిపారు. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయనున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.