బతుకునిచ్చే బతుకమ్మా.. తెలంగాణకు సిరులు ఇవ్వమ్మా.. - MicTv.in - Telugu News
mictv telugu

బతుకునిచ్చే బతుకమ్మా.. తెలంగాణకు సిరులు ఇవ్వమ్మా..

October 9, 2018

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. అన్నదమ్ములు పూలు తెచ్చిస్తుంటే.. అక్కాచెళ్ళెలు బతుకమ్మలు పేరుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ఈ పండుగను ప్రజలు తొమ్మిది రోజులు జరుపుకోనున్నారు. పట్టణాల్లో ఉంటూ.. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే‌వారు పల్లెలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

పెళ్లిళ్లు చేసుకుని మెట్టినింటికి వెళ్లిన అక్కాచెల్లెళ్లు పుట్టినింటికి వస్తుండటంతో పండుగ వాతావరణం నెలకొంది. చదువుల కోసం పట్టణాల్లో ఉంటున్న విద్యార్థులకు కూడా ప్రభుత్వం నేటి నుంచి సెలవులు ప్రకటించడంతో  గ్రామాలకు బయలుదేరారు. దీంతో పల్లెలు చిన్నపెద్దల ఆటపాటలతో సందడి నెలకొంది.

తెలంగాణ ప్రజలకు ఈ రెండు పండుగలు పెద్దవి..

Bathukamma Festival Start From Today For Nine Days In Telangana

ప్రతి సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చే బతుకమ్మ, దసరా పండుగలు తెలంగాణ  ప్రజలకు ఎంతో ముఖ్యమైనవి. వీటిని ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలోని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్టోబర్ 9 అంటే నేటి నుంచి 17 వరకు ‘బతుకమ్మ పండుగ’ సంబరాలు జరుగనున్నాయి. మనిషికి, ప్రకృతితో ఉన్న సంబంధానికి ప్రతీక బతుకమ్మ పండుగ.. తొమ్మిది రోజుల పాటు పూలనే దేవతలుగా ఆరాధించే గొప్ప సంప్రదాయం ఇది. 9 రోజులు 9 రూపాల్లో బతుకమ్మను తయారుచేసి, పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో పండుగను చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. వీటిలో చివరిదైన సద్దుల బతుకమ్మ పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.

తొమ్మిది రోజులు రోజుకో రూపం.. రోజుకో పేరుకు..

ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్య బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ .

మైక్ టీవీ బతుకమ్మ పాటలు

బతుకమ్మ పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేది పాటలు. అక్క చెళ్లెళ్ల పాటలు, చప్పట్ల మోతలు మోగుతుంటే.. అన్నదమ్ములు పక్కన వేసే కోలలు ఎంతో ఆకర్షణనిలిచిపోతాయి. ఈ మధ్య కాలంలో బతుకమ్మ ఘనతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు మైక్ టీవీ చాలా పాటలను రూపొందించింది.

గతేడాది ఒక పాట విడుదల చేయగా.. ఆ పాటను 3కోట్లకు పైగా మంది విక్షించారు. ఈ ఏడాది రూపొందించిన పాట విడుదల చేసిన రెండు రోజుల్లోనే 25లక్షల మంది విక్షించారు.