దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే, గత కొంత కాలంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో కాలిపోవడం, అమాంతం పేలిపోవటం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. వరుసగా జరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు.. వాహనదారుల్లో ఆందోళన రెకెత్తిస్తోంది. మరణాలు సైతం సంభవించడంతో.. కేంద్రం సైతం విషయాన్ని సీరియస్గా పరిగణించి దర్యాప్తులకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల్లో మంటలు చెలరేగడానికి గల కారణాలను డీఆర్డీవో ఒక నివేదికలో తెలిపింది.
ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి బ్యాటరీ సెల్స్, మాడ్యూల్స్ లోపభూయిష్టంగా ఉంటమేనని డీఆర్డీవో తన నివేదికలో వెల్లడించింది. బ్యాటరీ లోపాలు కారణంగానే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఓ నివేదిక రూపొందించింది. బ్యాటరీ ప్యాక్స్ డిజైన్లు, సరైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే బ్యాటరీ బండ్లను మార్కెట్లోకి రిలీజ్ చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తన నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాదు ఖర్చు తగ్గించుకునేందుకు లో-గ్రేడ్ మెటీరియల్ను ఉద్దేశపూర్వకంగానే ఉపయోగించడం.. ప్రమాదాలకు కారణమైందని డీఆర్డీవో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఈ-మోటర్సైకిల్ల వినియోగాన్ని 2030 నాటికి 80 శాతానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.