ఉరితాళ్ల స్పెషల్ బక్సర్ జైలు.. అక్కడే ఎందుకు?   - MicTv.in - Telugu News
mictv telugu

ఉరితాళ్ల స్పెషల్ బక్సర్ జైలు.. అక్కడే ఎందుకు?  

December 9, 2019

jail 02

నిర్భయ కేసు దోషులుకు డిసెంబర్ 16న ఉరిశిక్ష విధిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే అధికారులు దీన్ని ధ్రువీకరించడం లేదు. మరోపక్క… ఈ నెల 14కల్లా 10 ఉరితాళ్లు సిద్ధం చేయాలని తమకు తీహార్ జైలు నుంచి ఆర్డర్ అందినట్లు బిహార్‌లోని బక్సర్ జైలు అధికారులు చెప్పారు. దేశంలో ఉరితాళ్లను కేవలం ఆ జైల్లోనే తయారు చేస్తున్నారు. ఆర్డర్ వచ్చిందంటే ఉరి ఖాయమైనట్లేనని భావిస్తారు. గతంలో పార్లమెంటు దాడి కేసులో అఫ్జల్ గురుకు, ముంబై దాడుల కేసులో కసబ్‌కు వేసిన ఉరితాళ్లు ఇక్కడే తయారయ్యాయి. 

బక్సర్ జైల్లోనే ఉరితాళ్లను పేనించడం సంప్రదాయంగా వస్తోంది. 1930ల నుంచి ఉరితాళ్లను ప్రభుత్వాలు అక్కడే తయారు చేయిస్తున్నాయి. తాళ్లు పేనేప్పుడు కావల్సిన తేమ(67 శాతం) వాతావరణం అక్కడ ఉంది. దగ్గర్లోనే గంగానది ప్రవహిస్తోంది. దశాబ్దాలుగా తాళ్ల తయారీకి వాడుతున్న యంత్రాన్ని జైల్లో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. 

తయారీ ఇలా.. 

ఉరి తీయాల్సిన వ్యక్తి ఎత్తును బట్టి తాడు పొడవును నిర్ధారిస్తారు. తాడు దోషి ఎత్తుకు 1.6 రెట్లు పొడవుగా ఉంటుంది. భటిండాలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చే జే34 రకం నూలుతో తాయరు చేస్తారు. తాళ్లను పేనే పద్ధతిలోనే ‘ట్విస్ట్ అండ్ టార్క్’ దీన్నీ పేనుతారు. గొంతుకు గట్టిగా బిగుసుకోడానికి తాడు మధ్యలో ఇనుము, ఇత్తడి తీగలను కూడా అమరుస్తారు. ఒక తాడును 8 మంది ఖైదీలు కలసి తయారు చేస్తారు. బక్సర్ జైలు చివరిసారి అమ్మిన ఉరితాడు ఖరీదు రూ. 1750. తాజా ధర రూ. 2వేలకు పైగానే పలకొచ్చని చెబుతున్నారు.