ముంబై, ఢిల్లీల్లోని బీబీసీ కార్యాలయాల్లో జరిగిన ఐటీ దాడులపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ) సోదాల వివరాలను బయటపెట్టింది. మనదేశంలో బీబీసీ చాలా ఆర్థిక అక్రమాలకు పాల్పడిందని వెల్లడించింది. ‘‘ఆర్ధిక లావాదేవీల్లో పలు అక్రమాలు జరిగినట్లు మా దృష్టికి వచ్చింది. బీబీసీ తన ఆదాయ మార్గాలపై వివరాలు ఇవ్వలేదు. సంబంధిత పత్రాలను కూడా సకాలం ఇవ్వలేకపోయింది. ఇండియా నుంచి చాలా మొత్తం డబ్బును విదేశాలకు పంపారు. పలు చెల్లింపులపై పన్ను ఎగ్గొట్టారు. దేశంలోని బీబీసీ అనుబంధ సంస్థల మధ్య ఇష్టారాజ్యంగా లావాదేవీలు జరిగాయి’’ అని తెలిపింది.
నాలుగు రోజుల పాటు జరిగిన సోదాల్లో కీలకమైన ఆధారాలను, ఎలక్ట్రానిక్ డేటా, డాక్యుమెంట్లను పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు చెప్పారు. బీబీసీ ఉద్యోగులు విచారణకు సహకరించకపోవడం వల్ల సోదాల్లో జాప్యం జరిగిందని తెలిపారు. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న బీబీసీ మనదేశంలో 2012 నుంచి ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గుజరాత్ అల్లర్ల వెనక మోదీ హస్తం ఉందనే ధోరణిలో బీబీసీ ఇటీవల డాక్యుమెంటరీలను ప్రసారం చేసినందుకు ప్రతీకారంగానే ఐటీ దాడులు జరిగినట్లు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాము ఐటీ అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నామని బీబీసీ ఇండియా విభాగం తెలిపింది.