కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటో ముద్రించాలని, నూతన పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్, జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలని పరశురామ్ చేస్తున్న ఉద్యమం చాలా గొప్పది కాబట్టి.. ఈ అంశంపై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఈ విషయమై పార్లమెంటులో కొట్లాడుతానని తెలిపారు.
సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశురామ్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం, అంబేడ్కర్ పట్ల అభిమానం ఉంటే పార్లమెంటు ఉభయ సభల ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తాలని, లేదంటే వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంబేడ్కర్ ఫొటో సాధన సమితి సభ్యులతోపాటు కొందరు బీసీ నేతలు కూడా పాల్గొన్నారు.