2022 టీ20 వరల్డ్ కప్ ఓటమి తర్వాత టీంఇండియా ప్రక్షాళనకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. 2017 నుంచి టీ20 కప్ గెలవలేని భారత్ జట్టు పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2024 వరల్డ్ కప్ లక్ష్యంగా ఇప్పటినుంచే టీంను సిద్ధం చేస్తుంది. ఇటీవల సెలక్షన్ కమిటీపై మొదటి వేసిన బీసీసీఐ..రాబోయే రోజుల్లో కీలక విషయాలను వెల్లడించనుంది. వాటిలో ప్రధానంగా కెప్టెన్, కోచ్ మార్పు అంశాలు ఉండనున్నాయి. టీ20లో కేవలం యువకులకే పెద్దపీట వేసే అంశాన్ని పరిశీలిస్తున్న బీసీసీఐ.. సీనియర్లను ధనాధన్ ఆటకు దూరం చేయాలని భావిస్తుంది. అదేవిధంగా వన్డే, టీ20 ఫార్మెట్లకు ఇద్దరు కెప్టెన్లు, ఇద్దరు కోచ్‌లను కూడా నియమించే ఆలోచనలో ఉంది బీసీసీఐ.
ప్రస్తుతం టీం ఇండియా కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌ను త్వరలోనే టీ20ల నుంచి తప్పించే అవకాశం ఉందని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించినట్లు ఇన్ సైడ్ స్పోర్ట్స్ తన కథనంలో తెలిపింది. టీ20 వరల్డ్ కప్‌లో ఓటమి కారణంగా రాహుల్ ద్రవిడ్ స్థానంలో మరో కొత్త కోచ్‌ను నియమించే ఛాన్స్ ఉందని ఆ అధికారి పేర్కొన్నాడు. మరోవైపు టీ20 కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించి అతడి స్థానంలో హార్దిక్ పాండ్యను నియమిస్తారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. శ్రీలంకతో సిరీస్ ప్రారంభానికి ముందు హార్దిక్‌కు అధికారికంగా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించనున్నారని బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం.
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో గుజరాత్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా తన జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. ఆ తర్వాత ఐర్లాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో కూడా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టి20 సిరీస్‌లో టీమిండియాకు హార్దిక్ సారథ్యం వహించాడు. ఈ సిరీస్‌లో భారత్ 1-0తో విజయం సాధించింది.