ముంబాయిలో బీసీసీఐ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జై షా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్, జాతీయ క్రికెట్ అకాడమీ అధ్యక్షుడు వీవీఎస్ లక్ష్మణ్, సీనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ హాజరయ్యారు. వచ్చే ఏడాది వరల్డ్ కప్ సహా, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు సంబంధించిన పలు కీలక విషయాలపై ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి.
వన్డే వరల్డ్ కప్ కోసం 20 ప్లేయర్స్
ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం సమావేశంలో ప్రధానంగా చర్చించారు. వరల్డ్ కప్ కోసం 20 మంది ఆటగాళ్ల లిస్ట్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడు నెలల్లో ఈ 20 మంది ప్లేయర్స్ మూడు ఫార్మాట్లో రొటేషన్ పద్దతిలో ఆడించి..వరల్డ్ కప్ టీంను సిద్ధం చేయాలని ఆలోచిస్తున్నారు. అదే విధంగా ఆటగాళ్ల పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని ఐపిఎల్ ఫ్రాంచైజీలతో కలిసి NCA పనిచేయాలని నిర్ణయించారు. IPL సమయంలో, 20 మంది సభ్యుల పూల్‌లో భాగమైన ప్రతి ఆటగాడిని NCA నిశితంగా పరిశీలించనుంది.
కోచ్ మార్పు లేనట్టే..
ఆసియాకప్ ఓటమి, టీ 20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమణ తర్వాత కోచింగ్ సిబ్బంది మార్చేస్తారని పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాది నుంచి కొత్త కోచ్‌ను ఏర్పాటు చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం బీసీసీకి కోచింగ్ టీంను మార్చే ఆలోచన లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనిపై సమావేశంలో చర్చ జరగలేదని తెలిపాయి
యో-యో టెస్ట్ తిరిగి వచ్చింది
గత రెండు సంవత్సరాలుగా రద్దైన యో-యో పరీక్ష తిరిగి తేవాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై పెరుగుతున్న ఆందోళనలతో, యో-యో పరీక్ష ప్రధాన ప్రమాణంగా ఉండటంతో ఫిట్నెస్ అంశంలో ఎలాంటి రాజీ పడకుండా ఉండేందుకు మళ్లీ దీనిని తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ టెస్ట్ ద్వారా ఆటగాళ్ల పిట్ నెస్‌ను అంచనా వేస్తారు. ఈ పరీక్షలో పాస్ అయితే జట్టులో స్థానం లభిస్తుంది.