వానల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా? - MicTv.in - Telugu News
mictv telugu

వానల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

October 9, 2019

rain.

వర్షాకాలం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంతే ఆందోళన పెడుతోంది. ఏ కాలంలో లేని విధంగా ఈ కాలంలో వ్యాధులు వ్యాపిస్తాయి. అందుకే వర్షాకాలంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తారు. వానల్లో ఎక్కువగా ప్రబలే వ్యాధుల్లో మలేరియా, డెంగీ ముఖ్యమైనవి. వర్షాన్ని ఆస్వాదించడం మాత్రమే కాదు వానల ద్వారా ప్రబలే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

 

ఆహార జాగ్రత్తలు.. 

వర్షాకాలంలో ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో కలుషిత మంచినీటిని తాగితే కలరా, టైఫాయిడ్, కామెర్లు వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కాల్చి చల్లార్చిన నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈగలు వాలిన, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు. వేడి ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు.

 

డెంగీతో జాగ్రత్త…

వర్షాకాలం వ్యాప్తిచెందే ప్రాణాంతక వ్యాధుల్లో డెంగీ చాలా ప్రమాదకరమైనది. ప్రతి ఏడాది ఈ వ్యాధి బారిన పడి ఎందరో మృత్యువాత పడుతుంటారు. అందుకే డెంగీ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. ఏడీఎస్ ఈజిప్టు అనే దోమ వల్ల డెంగీ సోకుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి తీవ్రమైన జ్వరం వస్తుంది. అలాగే వారి రక్తకణాలు తగ్గిపోతాయి. శరీరంలోని పలు అవయవాల నుంచి తీవ్ర రక్తస్రావం జరిగే అవకాశముంది. డెంగీ మరణించే ప్రమాదం కూడా ఎక్కువే. ఈ వ్యాధి ఎక్కువగా పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది. ఆకస్మాత్తుగా తీవ్ర జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, కళ్లనొప్పి, కండరాలు, కీళ్లనొప్పులు, ఆకలి మందగించడం, శరీరంపై దద్దుర్లు రావడం, వికారం, వాంతులు. తీవ్రమైన కడుపునొప్పి, మనిషి చల్లబడటం, పాలిపోయినట్టు ఉండటం,నిద్రలేమి, అధిక దాహం, నాడీ బలహీనంగా ఉండటం, శ్వాస కష్టంగా ఉండటం ఈ వ్యాధి లక్షణాలు.

 

మలేరియాతో జాగ్రత్త..

వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే వ్యాధుల్లో మలేరియా ఒకటి. ఈ వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశల్లోనే గుర్తించి హాస్పిటల్‌లో పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. మలేరియా ఎక్కువగా దోమల వల్ల వ్యాపిస్తుంది. మలేరియా కలుగజేసే దోమలు జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో ఎక్కువగా వ్యాప్తిచెందుతాయి. రోజు విడిచి రోజు జ్వరం రావడం తలనొప్పి, ఒంటి నొప్పులు, వణుకుతో కూడిన జ్వరం, చెమటలు పట్టడం రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ముందస్తు జాగ్రత్తలు…

దోమకాటుకు గురి కాకుండా దోమ తెరలను వాడాలి. ఇంటి తలపులు, కిటికీలను ఎప్పటికప్పుడు మూసి ఉంచుకోవాలి. ఇంటిలోపల, బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు వహించాలి. నీటి ట్యాంకర్లను వారానికి ఒకసారి శుభ్రపరచాలి. ఇంటి ఆవరణలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు పరిశుభ్రతను పాటిస్తే చాలా వరకు ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. ముఖ్యంగా ఆహారం విషయంలో తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలి. ఇంటి పరిసరాల్లో దోమలు లేకుండా చూసుకోవాలి. వాడి పడేసిన కొబ్బరి బొండాలు, టైర్లు లేకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాల్లో నీటి నిలువ లేకుండా చూసుకోవాలి. తడి చెత్త వ్యర్థ పదార్థాలను రోడ్లపై కాకుండా చెత్త కుండీల్లో మాత్రమే వేయాలి. మల మూత్ర విజర్జన ఎక్కడ పడితే అక్కడ చేయకుండా మూత్రశాలను ఉపయోగించడంతో పాటు పలు రకాల జాగ్రత్తలు పాటించాలి.