Be showered with kisses...be healthy
mictv telugu

ముద్దులతో ముంచేయండి…ఆరోగ్యంగా ఉండండి

January 12, 2023

Be showered with kisses...be healthy

ముక్కుపై ముద్దు పెట్టు….ముత్యమై పోయేట్టు…అంటూ మన తెలుగులో ముద్దు మీద ఒక పాటే ఉంది. ముద్దు అనేది ఓ భావ వ్యక్తీకరణ. ఎదుటి వ్యక్తిపై మనకున్న ప్రేమను తెలియజేయడంలో ముద్దు కూడా ఒకటి. మాట్లాడకుండానే ఈ ఒక్క ముద్దు ద్వారా ఎదుటివారిపై ఉన్న అభిమానానాన్ని చెప్పొచ్చు. అందుకే ముద్దు గురించి ఎన్నో కవితలు, కవిత్వాలు, పాటలు, మాటలు ఇలా వస్తూనే ఉంటాయి. ఈ పేరుతో సినిమాలు కూడా వచ్చి హిట్ కొట్టినా సందర్భాలు ఉన్నాయి.

కిస్‌.. అనేది నిజంగా అంత కిక్ ఇస్తుందా..ఇది తెలియని వాళ్ళఉ ఎవరైనా ఉంటారా. ఎవరైనా మనల్ని దగ్గరికి తీసుకుని ముద్దు చేసినా.. ముద్దు పెట్టినా ఆ అనుభూతి మర్చిపోగలమా. ముద్దు అనేది కేవలం లవర్స్, కపుల్స్ మధ్య ఉండేదే కాదండోయ్.. ప్రేమ, అభిమానం ఉండే అన్ని బంధాల మధ్య కూడా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.. మన దగ్గర ఇప్పుడిప్పుడే కాస్త విస్తరిస్తున్నప్పటికీ.. ముద్దుతో పలకరించే సాంప్రదాయం విదేశాల్లో ఎప్పట్నుంచో ఉండనే ఉంది. అందుకే ముద్దుని బెస్ట్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ అంటారు. చిన్నపిల్లల్ని ప్రేమతో పెట్టే ముద్దు , అలిగినప్పుడు ముద్దు పెట్టి బతిమాలితే బుజ్జగింపు, యవ్వనంలో ప్రేమని తెలియజేసే ప్రేమ ముద్దు, అబ్బో ఒక్కటేవిటి.. ముద్దుల్లో చాలా రకాలు ఉన్నాయి.

ముద్దులు వల్ల కేవలం అనుభూతి మాత్రమే కాదు… ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఎవరైనా దగ్గరికి తీసుకుని ముద్దు పెడితే క్షణాల్లో ఒత్తిడి మాయం అవుతుంది. ఇలా రెగ్యులర్‌గా ముద్దులు పెట్టుకునే జంటలు ఎప్పటికీ ఆనందంగా, మిగతా వారితో పోల్చితే అనోన్యంగా ఉంటారట.

ముద్దు పెట్టుకున్నప్పుడు విడుదలయ్యే సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ రసాయనాల వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. ముద్దు పెట్టుకున్నప్పుడు విడుదలయ్యే ఎపినెఫ్రిన్ వల్ల రక్త నాళాలు వ్యాకోచించి రక్త సరఫరా మెరుగుపడుతుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల మెడ, దవడ కండరాలకు మంచి వ్యాయామం జరుగుతుంది.

ఒక ముద్దు వల్ల మన ముఖంలోని 34 కండరాలతోపాటు 112 పోస్ట్రల్ కండరాలు ఉత్తేజితం అవుతాయట. అలాగే ముద్దు పెట్టుకునేవారిలో 10 నుంచి 15 కేలరీల శక్తి బర్న్ అవుతుంది. శరీర మెటబాలిక్ రేట్ పెరిగి బరువు తగ్గుతుందట. ఒక ముద్దు స్త్రీ, పురుషుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. శృంగారానికి ప్రేరేపిస్తుంది. అంతే కాదు గుండె పనితీరును మెరుగుపరిచేందుకు, గుండె వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ముద్దు పనిచేస్తుందంటున్నారు నిపుణులు. అదేవిధంగా పెదవి ముద్దు వల్ల దంతాలు తెల్లగా మెరుస్తాయట. ఇక ఒక్క ముద్దు వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..ఒత్తిడి, ఆందోళన, ఆత్రుత నుంచి దూరం చేస్తుంది. అలాగే రక్తపోటును కూడా నియంత్రిస్తుందట.

ముద్దు పెట్టుకునే సమయంలో ఉత్పన్నమయ్యే సలైవా (ఉమ్మి) వల్ల దంత క్షయం దూరమవుతుందట. ఇక ముద్దు పెట్టుకునే సమయంలో శరీరం అడ్రినలిన్ అనే రసాయనాలు విడుదలవుతాయి. ఈ రసాయనం నొప్పులను నియంత్రిస్తుంది. అలాగే తలనొప్పిని సైతం తగ్గిస్తుందట. ముద్దుపెట్టుకోవడం వల్ల ఒకరి శరీరంనుంచి మరొకరి శరీరంలోకి బాక్టీరియా బదిలీ కావడం వల్ల ఇద్దరిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. మెడిటేషన్ వల్ల కలిగే ప్రయోజనాలన్నీ ఒక ముద్దులో లభిస్తాయట. ముద్దు సమయంలో ఉత్పత్తయ్యే సెరోటోనిన్ డోపమైన్, ఆక్సిటోసిన్‌లు మిమ్మల్ని సంతోషం ఉంచేందుకు దోహదం చేస్తాయి. ఇలా ముద్దు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.