తెలంగాణ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు, ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ మధ్య కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్‌తోపాటు ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరోసారి హెచ్చిరించింది.
”నేడు రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములతో కూడిన వాన కురిసే అవకాశం ఉంది. శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవనాల ప్రభావానికి తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ నెల 7 నుంచి 9 మధ్య భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది” అని వాతావరణ శాఖ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.