పెళ్లిలో ఎలుగుబంటి లొల్లి.. బావిలో పడిపోయి.. - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లిలో ఎలుగుబంటి లొల్లి.. బావిలో పడిపోయి..

June 13, 2019

ఎండ తీవ్రతకు అడవుల్లోని జంతువులూ, పక్షులు విలవిలాడుతున్నాయి. ఆహారం కోసం, నీటి కోసం పరిసర గ్రామాల్లోకి వస్తున్నాయి. నీటి కోసం ఒక ఎలుగుబంటి పెళ్లివారింట్లో చొరబడి నలుగురిని గాయపరిచిన సంఘటన కలకలం రేపింది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ పరిధిలోగల భటక్కర్ గ్రామంలో చోటుచేసుకుంది.

శుభం ప్రజాపతి అనే యువకుని వివాహం జరుగుతోంది. ఇంతలో ఎక్కడి నుంచో ఒక ఎలుగుబంటి పెళ్లివారింట్లో చొరబడి మహిళలపై దాడికి దిగి ఇద్దరిని తీవ్రంగా గాయపరిచింది. తరువాత ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి మరికొంతమందిపై దాడి చేసింది. అనంతరం పారిపోతూ ఒక నూతిలో పడిపోయింది. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని అతి కష్టంమీద ఆ ఎలుగుబంటిని బయటకు తీయడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు.