అడవిలోని గుడికి వెళ్లి.. ఎలుగుబంటికి చిక్కిన జంట - MicTv.in - Telugu News
mictv telugu

అడవిలోని గుడికి వెళ్లి.. ఎలుగుబంటికి చిక్కిన జంట

June 6, 2022

పూజలు చేసేందుకు దట్టమైన అటవీ ప్రాంతంలోని గుడికి వెళ్లిన దంపతులను.. ఓ ఎలుగుబంటి చంపి తినేసింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని పన్నా జిల్లా కేంద్రానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేర్మై ప్రాంతంలో చోటుచేసుకుంది. రాణిగంజ్ ప్రాంతానికి చెందిన ముకేశ్ ఠాకూర్ (50), ఇందిరా ఠాకూర్ (45) దంపతులు అడవిలోని దేవాలయానికి వెళ్లారు. ఆలయం వద్ద దంపతులు ప్రార్థనలు చేస్తుండగా ఎలుగుబంటి వారిపై దాడి చేసి చంపి వారి శవాలను తినేస్తున్నట్లు గుర్తించామని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌ఓ) గౌరవ్ శర్మ తెలిపారు. ఎలుగుబంటి వారిని చంపి దాదాపు 5 గంటలపాటు వారి శరీర భాగాలను తిన్నదని… అటవీ శాఖ సిబ్బంది సహాయంతో చివరకు దానిని పట్టుకున్నట్లు చెప్పారు.

దంపతుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, ఎలుగుబంటిని ఏదైనా జంతుప్రదర్శనశాలకు పంపాలని అనుకుంటున్నామని గౌరవ్ చెప్పారు. మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ. లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని అధికారులు చెప్పారు .సంఘటన జరిగిన రెండు మూడు గంటల తర్వాత పోలీసులు, అటవీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని దంపతుల బంధువులు తెలిపారు.