పిజ్జా హట్‌లో ఎలుగుబంట్లు పడ్డాయి!


ఆకలి తీర్చుకునే మార్గం లేకపోతే మనుషులే కాదు జంతువులు కూడా ‘నేరాల’కు పాల్పడతాయి. నియమ నిబంధనలను తుంగలో తొక్కి దొరికిన తిండితో కడుపు నింపుకుంటాయి. అమెరికాలోని కొలరాడాలో ఇదే జరిగింది. మాంచి ఆకలితో ఉన్న ఓ ఎలుగుబంటి, దాని రెండు పిల్లలు ఓ అర్ధరాత్రి ఒక పిజ్జా హట్ కిటికీని బద్దలు కొట్టి లోపలికెళ్లాయి. వంటగదిలోకి వెళ్లి డబ్బాలు, అలమారాలు.. కనిపించినవన్నీ వెతికాయి. కనిపించిన తిండినంతా మెక్కేశాయి. పిజ్జా పిండిని కడుపారా ఆరగించాయి. తర్వాత బ్రేవ్‌మని తేన్చుకుంటూ వెళ్లిపోయాయి. ఉదయం హోటల్ తెరిచిన సిబ్బంది అక్కడ జరిగిన నానా కంగాళీ చూసి నెత్తీనోరూ బాదుకున్నారు. ఎవరు చేశారీ పని అని సీసీకెమెరాల్లో చూడగా విషయం తెలిసింది. ఈ ఎలుగుబంట్ల చోరీ వీడియో వైరల్ అవుతోంది. ఆ ప్రాంతంలో ఎలుగుబంట్ల బెడద ఎక్కువగా ఉందట. అయితే అవి ఆకలితో తమ హోటల్లోకి వస్తే కాస్త తిండిపడేస్తామని సదరు పిజా హట్ చెప్పింది. పోలీసులు వాటిని కాల్చొద్దని కూడా కోరింది.

SHARE