ఫిలిప్పీన్స్‌లో భారతీయులపై రక్తం కారేలా దాడి  - MicTv.in - Telugu News
mictv telugu

ఫిలిప్పీన్స్‌లో భారతీయులపై రక్తం కారేలా దాడి 

October 16, 2020

వర్ణ వివక్ష ఇప్పుడు కొన్ని దేశాల్లో కొనసాగుతోంది. దాయాది దేశం పాకిస్తాన్‌లో మైనారిటీలు అయిన హిందువులపై దాడులు జరగడం నిత్యకృత్యంగా మారిన విషయం తెలిసిందే. అలాగే అమెరికాలో నలుపు, తెలుపుల గురించి జరుగుతున్న గొడవలు కొత్త కాదు. ఉన్నత విద్యను అభ్యసించడానికి దేశ విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థులు విదేశాలలో తీవ్ర వివక్షను ఎదుర్కుంటున్నారు. తాజాగా ఫిలిప్పిన్స్‌లో భారతీయ విద్యార్థులపై అమానుష దాడి జరిగింది. తమిళనాడుకు చెందిన విద్యార్థిపై అగంతకులు దాడి చేశారు. వర్ణ వివక్ష చూపుతూ అతి దారుణంగా హింసించినట్లు సమాచారం.

తమిళనాడుకు చెందిన జవహర్ శ్రీనాథ్ అనే విద్యార్ధి గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఓ షాపుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ముగ్గురు అగంతకులు  నీ పేరేంటి, నీ దేశం ఏది అంటూ తీవ్ర పదజాలంతో వర్ణవివక్ష చూపుతూ రాడ్లతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. వారి దాడిలో శ్రీనాథ్ పళ్లు ఊడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇది గమనించిన తోటి విద్యార్ధులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లిన భారతీయ విద్యార్దులు శ్రీనాథ్‌ ఘటనతో ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. స్థానిక పోలీసుల నుంచి తమకు మద్దతు లభించడం లేదని వాపోతున్నారు.