యాదాద్రి గోడలపై కేసీఆర్ ఎందుకంటే.. ఆలయ అధికారి
యాదాద్రి పుణ్యక్షేత్రం ఆలయ గోడలపై, స్తంభాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, కారు బొమ్మలు చిత్రించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ శిలలపై కేసీఆర్ బొమ్మలు ఎందుకు వేశారని విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. దీనిపై యాదాద్రి ఆలయ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్ కిషన్ రావు స్పందించారు. ఈ బొమ్మల విషయం తమకు తెలీదని.. స్తపతితో మాట్లాడి వివరణ తీసుకుంటానని చెప్పారు. ఏ ఆలయంలోనైనా అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా శిల్పాలు చెక్కడం సహజమేనని స్పష్టంచేశారు.
అయితే, ప్రత్యేకంగా ఫలానా బొమ్మలు చెక్కాలని తాము శిల్పులకు చెప్పలేదని, ఎవరి బొమ్మలు చెక్కాలనేది శిల్పుల ఇష్టమని చెప్పారు. కేవలం బాహ్య ప్రాకారంలోనే ఈ బొమ్మలు వున్నాయని, ఇవి ఏ వ్యక్తి కోసమో చెక్కిన బొమ్మలు కావని ఆయన అన్నారు. అహోబిలం పుణ్యక్షేత్రంలో నెహ్రూ, గాంధీ బొమ్మలు వున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోసమే చెక్కించామని అనడం సరికాదని.. వీటిపై అభ్యంతరాలు వస్తే మార్పులు చేస్తామని పేర్కొన్నారు.