హైదరాబాద్ కళాకారుడి గిన్నిస్ రికార్డ్..  - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ కళాకారుడి గిన్నిస్ రికార్డ్.. 

October 24, 2020

వజ్రాలు పొదిగిన ఉంగరాలను చూసుంటాం. అలా ఒక ఉంగరంలో ఒకటి లేదా రెండు అంతకన్నా ఎక్కువ వజ్రాలు ఉంటాయి. అయితే ఒకటి కాదు రెండు కాదు వందలు కూడా కాదు.. ఏకంగా వేలల్లో వజ్రాలు పొదిగి కళ్లు చెదిరే ఉంగరాన్ని తయారుచేశాడో వ్యక్తి. ఏడు వేలకు పైగా వజ్రాలను పొదిగి ఆ ఉంగరాన్ని రూపొందించి గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు. అతను ఎవరో కాదు.. పక్కా మన హైదరాబాదీ. ఆయన పేరు కొట్టి శ్రీకాంత్. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని ‘ది డైమండ్ స్టోర్’ యజమాని చందూబాయ్ కుమారుడు కొట్టి శ్రీకాంత్. 7,801 సహజసిద్ధమైన వజ్రాలను ఆ ఉంగరంలో పొదిగాడు శ్రీకాంత్. ‘ద డివైన్-7801 బ్రహ్మ వజ్ర కమలం’గా ఆ ఉంగరానికి పేరు పెట్టారు. వజ్రాల కమలం రేకులు విచ్చుకున్నట్టు ఉంగరం చూడగానే ఇట్టే ఆకట్టుకుంటోంది. ఉంగరంలో మొత్తం 6 వరుసలు ఉంటే 5 వరుసలలో 8 రేకులు ఉన్నాయి. 6వ లేయర్‌లో 6 పూల రేకులు ఉండి, 3 పుప్పొడి రేణువులు ఉన్నాయి. 

వేల వజ్రాలతో జిగేల్‌మంటున్న ఈ ఉంగరాన్ని చూశారంటే మగువలు ఫ్లాట్ అవాల్సిందే. తమ నిశ్చితార్థానికి ఈ ఉంగరమే కావాలని పట్టుబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ, అన్నేసి వజ్రాలు వాడారంటే దాని ధర కూడా భారీగానే ఉంటుంది. సిరిగల వారికి పెద్ద విషయం కాకపోయినా సామాన్యులకు ఆ ఉంగరం అందని ఆకాశమే. దక్షిణ భారతదేశంలో జ్యువెలరీ విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం ఇదే తొలిసారి. అత్యంత సహజసిద్ధమైన, స్వచ్ఛమైన రూపంగా పూజ కోసం ఈ బ్రహ్మకమలం వినియోగిస్తుంటారు. ‘గతంలో ముంబైకు చెందిన ఓ వ్యాపారి 7,777 డైమాండ్‌లతో ఉంగరాన్ని తయారుచేసి గిన్నిస్‌లో స్థానం సంపాదించాడు. నేను 7,801 వజ్రాలతో రింగ్ తయారుచేసి ఆ రికార్డును చెరిపేశాను’ అని శ్రీకాంత్ హర్షం వ్యక్తంచేశాడు. ఈ ఉంగరాన్ని తయారుచేయడానికి తనకు దాదాపు 11 నెలల సమయం పట్టిందని తెలిపాడు. దాని ప్లానింగ్, డిజైన్ చేయడానికే 5 నెలల సమయం పట్టగా, తయారీకి 6 నెలల సమయం పట్టిందని వివరించాడు. నవంబర్ చివరి వారం కాని, డిసెంబర్ మొదటి వారంలో కానీ ఈ ఉంగరాన్ని వేలం ద్వారా విక్రయించనున్నట్టు శ్రీకాంత్ తెలిపాడు.