నొప్పి లేకుండా చనిపోవాలి.. సుశాంత్ గూగుల్ సెర్చ్  - MicTv.in - Telugu News
mictv telugu

నొప్పి లేకుండా చనిపోవాలి.. సుశాంత్ గూగుల్ సెర్చ్ 

August 3, 2020

Before suicide, Sushant Singh Rajput’s Google search his name, manager, illness.

దివంగత బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బతికుండగా ఎంత ఫేమస్ అయ్యాడో.. అతను చనిపోయాక కూడా అంతే ఫేమస్ అయ్యాడు. నిత్యం అతని గురించిన ఏదో ఒక విషయం మీడియాలో వస్తోంది. సుశాంత్‌ది హత్యా, ఆత్మహత్యా అనే విషయంలో అనేక అనుమానాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. సుశాంత్ తండ్రి వీకే సింగ్ పాట్నా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో ముంబై పోలీసులు ఇప్పటివరకు 40 మందికి పైగా ప్రముఖుల స్టేట్‌మెంట్స్‌ను నమోదు చేశారు. తాజాగా సుశాంత్ చనిపోయే ముందు మూడు అంశాల గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసినట్లు ముంబై పోలిస్ అధికారి ఒకరు వెల్లడించారు. తన పేరుతో ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని వార్తలతో పాటు, మాజీ మేనేజర్ దిశా సాలియన్ పేరును, మెంటల్ హెల్త్‌కు సంబంధించిన ఆర్టికల్స్‌ను సుశాంత్ ఎక్కువగా సెర్చ్ చేశాడని  సదరు అధికారి తెలిపారు. 

నొప్పి లేకుండా చనిపోయే మార్గాల కోసం ఇంటర్‌నెట్‌లో అన్వేషించాడని అన్నారు.  పోలీస్ ఆఫీసర్ తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 14న ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటలకు ముందు సుశాంత్ అతని పేరునే గూగుల్ చేశాడు. ఈ విషయాలన్నీ కూడా తన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ ద్వారా ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్‌లో బయటపడ్డాయి. దిశా సాలియన్ ఆత్మహత్యతో తన పేరును జోడించడం వల్ల సుశాంత్ కలత చెందాడు. అందుకే అతను ఆ సమయంలో ఎక్కువగా ఈ మూడింటి గురించే ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశాడు. వీటి వల్లే అతడు మరింతగా డిప్రెషన్‌లోకి వెళ్లి ఉండొచ్చు అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారి వివరించారు. మరోవైపు సుశాంత్ బ్యాంక్ ఖాతాల వివరాలను కూడా పోలీసులు పరిశీలించారు. గత ఏడాది జీఎస్టీ కోసం పెద్ద మొత్తంలో రూ. 2.8 కోట్లు బదిలీ అయినట్లు గుర్తించారు.