ఆత్మహత్యాయత్నానికి ముందు తల్లితో ప్రీతి మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది. తనతో పాటు చాలా మంది జూనియర్లను సైఫ్ వేధిస్తున్నాడని తల్లికి చెప్పుకొని బాధపడింది. సీనియర్లు అంతా ఒక్కటేనని.. తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఏ రకంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తల్లికి తెలిపింది. సైఫ్ ఏం చేయలేడని ప్రీతికి తల్లి ధైర్యం చెప్పింది. చదువుపై దృష్టి పెట్టాలని ప్రీతిని తల్లి కోరింది. ఇప్పటికే సైఫ్ పై ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రీతికి తల్లి వివరించింది. చివరికి పోలీసులతో నాన్న ఫోన్ చేయించినా… లాభం లేకుండా పోయిందని చెప్పింది. ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశానని.. HOD తనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రీతి తల్లికి చెప్పింది. అయితే సైఫ్‌తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానని ప్రీతితో ఆమె తల్లి చెప్పినట్లు ఆడియోలో ఉంది. అన్నిదారులు మూసుకుపోవడంతో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
‘‘సైఫ్ నాతో పాటు చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడు. సీనియర్లంతా ఒకటిగా ఉన్నారు. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా లాభం లేకుండా పోయింది. సైఫ్ వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. నేను అతడిపై ఫిర్యాదు చేస్తే సీనియర్లంతా ఒక్కటై నన్ను దూరం పెడతారు. ఏదైనా ఉంటే తన దగ్గరికి రావాలి కానీ ప్రిన్సిపల్‌కి ఎందుకు ఫిర్యాదు చేశారని హెచ్‌వోడీ నాగార్జునరెడ్డి నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు’’ అని తల్లితో ప్రీతి పేర్కొంది.
ఈ నెల 22వ తేదీన కేఎంసీ మెడికల్ కాలేజీలో మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా మారడంతో హైద్రాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హైద్రాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో మెడికో ప్రీతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ మెడికో ప్రీతి ఆరోగ్యం విషమంగానే ఉంది. సీనియర్ సైఫ్ వేధింపుల కారణంగానే మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టుగా వరంగల్ సీపీ రంగనాథ్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఈ కేసులో సైఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.