బిచ్చగాడి గదిలో డబ్బు మూటలు.. లెక్కపెట్టే వీలు లేక.. - MicTv.in - Telugu News
mictv telugu

బిచ్చగాడి గదిలో డబ్బు మూటలు.. లెక్కపెట్టే వీలు లేక..

June 3, 2022

వీధుల్లో భిక్షాటన చేస్తూ.. తాయెత్తులు కడుతూ జీవనం గడుపుతున్న సాధువ.. హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. ఆ మరణవార్తను స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు.. అతడి గదిలో తనిఖీలు చేయగా రెండు సంచి మూటలు కనిపించాయి. వాటిని విప్పితే.. వందలాది పాలిథిన్‌ కవర్లు ఉన్నాయి. ఆ కవర్లలో వేలాది కరెన్సీ నోట్లు… చిల్లర నాణేలు కనిపించాయి. ఏపీలోని కాకినాడ జిల్లా కరప మండలం వేళంగి గ్రామంలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.

ఐదేళ్ల కిందట గ్రామానికి వచ్చిన రామకృష్ణ అనే బిచ్చగాడు.. భిక్షాటన చేస్తూ… చేపల మార్కెట్‌ వద్ద చిన్న గదిలో ఉంటూ జీవనం గడుపుతున్నాడు. ఆ దగ్గరలో ఉన్న సత్రంలో భోజనం చేసేవాడు. గురువారం గుండెపోటుతో చనిపోవడంతో పోలీసులు అతని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. అతడి గదిలో లభించిన డబ్బు మూటల్లో పది రూపాయల నోట్లే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు పోలీసులు. చీకటి పడడంతో వాటిని లెక్కించడం సాధ్యపడలేదని, నోట్లు, చిల్లరను సంచుల్లో పెట్టి సీలు వేసి స్టేషన్‌కు తరలించామని చెప్పారు మృతదేహాన్ని పంచాయతీ కార్మికులతో సహాయంతో ఖననం చేసినట్టు తెలిపారు. కాగా, అతడి వద్ద లభించిన నగదు రూ.2లక్షలకు పైనే ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.